
పాండ్రంగి.... ఈ పేరెపుడైనా విన్నారా?
పుస్తకాల పురుగులు, లేదా పోటీ పరీక్షలకు తెగ చదివే వాళ్లేమయిన ఈ పేరు వినివుండవచ్చు.
అంతకు తప్ప మరొక విధంగా ఈ పేరు ఈ తరానికి గుర్తుండే అవకాశం లేదు.
ఇదొక వూరు పేరు.
విశాఖ జిల్లా, భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం, పద్మనాభం మండలంలో ఈ వూరు ఉంటుంది.
ఇంతకంటే ముఖ్యంగా ఈ వూరు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన వూరు. ఇది అంతగా ఓట్లను తెచ్చే పేరు కాదుకదా, అందుకే ఈ పేరుమీద చెప్పుకో దగ్గ స్మారక చిహ్నాలు లేవు. అలా వుంటే ఈ పాటికి విశాఖ విమానాశ్రయం పేరు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అయి ఉండేది. అందుకే ఈ వూరు ఎవరికీ గుర్తు లేకుండాపోయింది.
అయితే, ఇపుడు ఈ వూరు పేరు వార్త అయింది.
ఎందుకంటే, పాండంగ్రిని అభివృద్ధి చేసేందుకు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ముందుకొచ్చారు. ఈ గ్రామాన్ని సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద అభివృద్ధి చేసేందుకు నిర్ణయించారు. ఈ పథకం కింద ప్రభు ఈ గ్రామంలో వసతులు మెరుగుపరచేందుకు కృష్టి చేస్తారు. 2019 నాటికి ఈ వూరికి అన్ని వసతులు ఎంపి సమకూర్చాలని నిర్ణయించారు.
సురేశ్ ప్రభు రైల్వే మంత్రే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆధికార తెలుగుదేశం పార్టీ బిజెపికి చెందిన సురేశ్ ప్రభును ఆంధ్ర నుంచి రాజ్యసభ కు పింపించేందుకు అంగీకరించింది.
సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద పాండ్రంగి ని ఎంపిక చేసిన విషయాన్ని రైల్వే మంత్రి ఒఎస్డి జెశ్రీనివాస్ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు లేఖరాశారు. పాండ్రంగి 2011 జనాభా లెక్కల ప్రకారం 5400 మంది జనాభా.
1897జూలై 4 సీతారామ రాజు ఈ గ్రామంలో జన్మించారు. ఈ ఏడాది 115 వ జయంత్యుత్సవాలు జరగాలి.
ఈవూరి ఒక స్మారక కేంద్రం చేయాలనే అలోచన లేదు కాబట్టి, ఇక్కడ సరైన వసతులు కూడా లేవు. సురేశ్ ప్రభు శ్రద్ధతో పాండ్రంగి కేవలం వార్తగా ఒక వెలుగు వెలిగి మాయమవుతుందా లేక నిజమయిన అభివృద్ధికి నోచుకుంటుందా చూడాలి.