Palle Panduga: గ్రామాల అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.11,085 కోట్ల పనులకు శ్రీకారం

Published : Sep 29, 2026, 09:28 PM IST
Palle Panduga 3.0

సారాంశం

Palle Panduga 3.0: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పల్లె పండుగ 3.0 కార్యక్రమాన్ని ప్రారంభించింది. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు కలిసి రూ.11,085 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

రోడ్లు, డ్రైనేజీలు, బస్ షెల్టర్లకు ప్రాధాన్యం

పల్లె పండుగ 3.0లో గ్రామాల అవసరాలకు అనుగుణంగా పలు రకాల పనులను చేపట్టనున్నారు. కొత్త పంచాయతీ భవనాలు, బస్ షెల్టర్లు నిర్మించడంతోపాటు సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, వీధిలైట్లు, తాగునీటి సదుపాయాలను మెరుగుపరచనున్నారు. పాడి రైతులకు ఉపయోగపడేలా మినీ గోకులాలు, పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ భూముల్లో పంట కుంటలు, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం చేపట్టడంతోపాటు ఉద్యానవన పంటల సాగును విస్తరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉండే ఉదయగిరి ప్రాంతాన్ని పండ్లతోటల సాగుకు అనుకూలమైన ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు.

గత రెండు దశల్లో చేపట్టిన పనులు

పల్లె పండుగ కార్యక్రమం ఇప్పటికే రెండు దశల్లో గ్రామీణ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులకు దోహదపడిందని ప్రభుత్వం వెల్లడించింది. మొదటి దశలో 4,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు 22,514 పశువుల షెడ్లు, 21,000 వ్యవసాయ చెరువులు ఏర్పాటు చేశారు. 64,000 ఎకరాల్లో ఉద్యానవన మొక్కలను నాటినట్లు పేర్కొన్నారు. రెండో దశలో 2,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 8,300 కిలోమీటర్ల బీటీ రోడ్ల పనులు చేపట్టారు. 15,750 పశువుల షెడ్లు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 86,000 వ్యవసాయ చెరువులు, 82,000 వ్యక్తిగత ఇంకుడు గుంతలు నిర్మించడంతోపాటు 32 కిలోమీటర్ల మేర మ్యాజిక్ డ్రెయిన్ల పనులు చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది.

గ్రామ స్వరాజ్యమే లక్ష్యమన్న నేతలు

పల్లె పండుగ 3.0తో గ్రామాల రూపురేఖల్లో గణనీయమైన మార్పు వస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ క‌ళ్యాణ్‌ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు, మినీ గోకులాలు, ఫామ్‌పాండ్లు వంటి పనులకు ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. మారుమూల తండాలకు సైతం రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని, 161 గ్రామీణ నియోజకవర్గాల్లో డొంక రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. అమరజీవి జలధార ద్వారా పలు ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని పవన్ క‌ళ్యాణ్ పేర్కొన్నారు. ఇదే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం దేశ ప్రగతికి కీలకమని అన్నారు. గ్రామాల్లో ఉపాధి, మౌలిక వసతులు పెరిగితే వలసలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రామాల అభివృద్ధి ద్వారా మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య దిశగా అడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఉదయగిరిలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | Palle Panduga 3.0 | Pawan Kalyan | Asianet News Telugu
పల్లె పండుగ 3.0లో BJP చీఫ్ PVN మాధవ్ స్పీచ్ | Chandrababu | Pawan Kalyan | Asianet News Telugu