AP Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడంటే..! క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్

Published : Sep 23, 2026, 03:17 PM IST
Nara Lokesh

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలయ్యింది. అయితే ఎన్నికల ఎప్పుడుంటాయనే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది… దీనిపై తాజాగా మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు.

AP Local Body Elections 2026 : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ, అధికారిక వర్గాల్లో కసరత్తు వేగం పెరిగింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియలు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తన నేతలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు స్థానిక ఎన్నికలపై మరింత ఆసక్తిని పెంచాయి.

అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు: లోకేశ్

విజయవాడలో మంత్రులతో నిర్వహించిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో నారా లోకేశ్ స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎన్నికలు జరగవనే అపోహలకు తావులేదని పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. కాబట్టి కూటమి అభ్యర్థుల కోసం ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు ముందుగానే సిద్ధం కావాలని లోకేశ్ సూచించారు. స్థానిక స్థాయిలో పార్టీ పరిస్థితులు, అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని లోకేశ్ తెలిపారు. అన్ని స్థానిక సంస్థల్లో ఎన్నికలు నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

సీట్ల సర్దుబాటుపై సమన్వయ కమిటీ నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా ప్రధాన అంశంగా మారనుంది. ఏ పార్టీ ఏ స్థానంలో పోటీ చేయాలనే దానిపై స్థానిక స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. సీట్ల పంపకం విషయంలో కూటమి సమన్వయ కమిటీ, పార్టీ అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటుందని లోకేశ్ అన్నారు. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విజయవాడలో సమావేశమై స్థానిక ఎన్నికల వ్యూహాలు, పొత్తులు, సీట్ల పంపకం, రిజర్వేషన్ల వంటి అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

ఎన్నికల సంఘం కూడా కసరత్తు ముమ్మరం

మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఓటర్ల జాబితాల తయారీ, వార్డుల వివరాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి ప్రక్రియలపై అధికారులు దృష్టి సారించారు.

ముఖ్యంగా పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సెప్టెంబర్ 22న మరో 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాల ప్రక్రియ పూర్తయినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వీటిలో పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో పాటు ప్రధాన నగరాల స్థానిక సంస్థలు ఉన్నాయి.

వార్డుల పునర్విభజన కూడా పూర్తి

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా చేపట్టారు. కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల హద్దులను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ ప్రక్రియ పూర్తైన ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఏర్పడింది.

ఇక గ్రామీణ స్థానిక సంస్థల విషయంలోనూ ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ఎంపిక వంటి అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచనలు వెళ్లాయి.

రెండు దశల్లో ఎన్నికలు జరిగే అవకాశం?

ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికలను దశలవారీగా నిర్వహించే అంశంపై చర్చ జరుగుతోంది. ముందుగా పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి, అనంతరం గ్రామీణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విధంగా ప్రణాళిక ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం గ్రామం లేదా వార్డు స్థాయి ఎన్నికలకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాలపైనా ప్రభావం చూపే అంశంగా పార్టీలు భావిస్తున్నాయి. అందుకే కూటమి పార్టీలు ఇప్పటికే స్థానిక స్థాయిలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను సమాయత్తం చేసే పనిపై దృష్టి పెట్టాయి. మరోవైపు అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లు, సీట్ల సర్దుబాటు వంటి అంశాలు కొలిక్కి వచ్చిన తర్వాత స్థానికంగా రాజకీయ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

అధికారిక నోటిఫికేషన్ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన పలు ముందస్తు ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఓటర్ల జాబితాల తయారీ, వార్డుల పునర్విభజన, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు వంటి అంశాల్లో కసరత్తు జరుగుతోంది. మంత్రి నారా లోకేశ్ మాత్రం అక్టోబర్‌లో ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల అధికారిక తేదీలు, నోటిఫికేషన్, పోలింగ్ దశలు వంటి వివరాలు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలు, రిజర్వేషన్ల ప్రక్రియ తదితర అంశాలపై వచ్చే నిర్ణయాలను బట్టి ఎన్నికల షెడ్యూల్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మొత్తంగా చూస్తే.. ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమవుతున్నామని చెబుతుండగా, ఎన్నికల సంఘం కూడా అవసరమైన పరిపాలనా ప్రక్రియలను ముందుకు తీసుకెళ్తోంది. దీంతో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Paritala Sunitha Sensational Comments ON Thopudurthy Prakash Reddy | Asianet News Telugu
పరిటాల గడ్డపై నుండి జగన్ కు వార్నింగ్ | Nara Lokesh Fires On YS Jagan | Asianet News Telugu