
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా టిడిపి రెడ్డి సామాజిక వర్గాన్ని సమీకరిస్తోందా? అందుకు జెసి దివాకర్ రెడ్డిని పనిముట్టుగా వాడుకుంటుందా ? అనే అనుమానాలు సర్వత్రా మొదలయ్యాయి. తాజాగా చంద్రబాబునాయడు కడప జిల్లాలోని పులివెందులలో పర్యటించిన నేపధ్యంలో తలెత్తిన పరిణామాలు అనుమానాలకు బలాన్నిస్తున్నాయి.
రాష్ట్రంలో రాజకీయం ప్రస్తుతం చంద్రబాబునాయుడు-జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాల చుట్టే తిరుగుతున్నాయి. విచిత్రమేమిటంటే ఇతర కులాలతో పోలిస్తే జనాభా రీత్యా ఈ రెండు సామాజికవర్గాలు మైనారిటీలో ఉండటం. అయినా రాజకీయాధికారం దశాబ్దాలుగా రెండింటి మధ్యే కొనసాగుతోంది. రాష్ట్రంలో మొదటి నుండి రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని ఉంది. ఎన్టీఆర్ రాకతో ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గం రెండో అధికార కేంద్రంగా తయారైంది. అప్పటి నుండి పై రెండు సామాజిక వర్గాల మధ్యే అధికారం మారుతోంది.
దివంగత నేత వైఎస్ జరిపిన పాదయాత్ర తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్సే తిరుగులేని నాయకుడయ్యారు. దాంతో రెడ్డి సామాజికవర్గంలో అత్యధికులు వైఎస్ వైపు చేరగా కమ్మ సామాజికవర్గం నేతలు చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలిచారు. 2003లో ఎన్నికలు, వైఎస్ సిఎం, తర్వాత మరణం, జగన్ పై కేసులు అందరికీ తెలిసిందే. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సిఎం అయ్యారు.
ఆ సమయంలో ప్రత్యమ్నాయం లేక అనంతపురం, నెల్లూరు, కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాల్లోని పలువురు రెడ్డి నేతలు ఆ విధంగానే టిడిపిలో చేరారు. అప్పటి నుండి నిజానికి రాష్ట్రంలోని రెడ్డి సామాజిక వర్గాంలో నాయకత్వ లేమి స్పష్టంగా కనబడుతోంది. అప్పటికే టిడిపిలో చేరిన దివాకర్ రెడ్ది సామాజిక వర్గంపై నాయకత్వం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయినా సాధ్యం కావటం లేదు. దాంతో జెసిలో తీవ్ర అసంతృప్తి మొదలైంది.
అదే సమయంలో బైలుపై తిరుగుతున్న జగన్ రాష్ట్రమంతా సుడిగాలిలా పర్యటిస్తు అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. జగన్నుబలహీన పరిస్తే కానీ తన ఆధిపత్యం సాధ్యం కాదని జెసి భావించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ విధానాలను గమనిస్తూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గంలో పునరాలోచన మదలైనట్లు సమాచారం. రెండున్నరేళ్లలో ప్రభుత్వంపై వివిధ వర్గాల్లో అసంతృప్తి మొదలైంది. అది గమనించిన రెడ్డి సామాజిక వర్గంలో వచ్చే ఎన్నికల విషయంలో గుబులు బయలుదేరింది. దాంతో అప్పటి వరకూ టిడిపిలోనే కొనసాగాలా? లేక వైసీపీలోకి మారాలా అన్న అయోమయంలో ఉన్నారు.
ఈ విషయం గమనించిన జెసి తరచూ జగన్ పై విరుచుకుపడుతున్నారు. పులివెందులలో జగన్ పై జెసి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. పైగా జగన్ను, జెసి కల్తీ రెడ్డిగా అభివర్ణిచటం గమనార్హం. తాను నిఖార్సైన రెడ్డినని, జగన్ కల్తీ(క్రిస్తియన్) రెడ్డి అని పేరు పెట్టకుండానే వ్యాఖ్యానించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టిడిపిలో ఉన్న రెడ్డి సామాజికవర్గం నేతలను వైసీపీలో చేరకుండా చంద్రబాబు పెద్ద ప్లానే వేసినట్లు కనబడుతోంది. అందుకనే జగన్ పైకి జెసిని ప్రయోగిస్తున్నట్లు సమాచారం.
ఎందుకంటే, మిగిలిన వారెవరూ జగన్ పై మాట్లాడే సాహసం చేయటం లేదు. జెసి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారంటే, దశాబ్దాలపాటు వైఎస్-జెసి మధ్య వైరం వుంది. కాబట్టి ఆ వైరాన్ని జెసి ఇపుడు జగన్ పై తీర్చుకుంటున్నట్లు కనబడుతోంది. 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఎటువంటి ఎన్నికలూ జరగలేదు. కాబట్టి ప్రభుత్వంపై ప్రజాభిప్రాయంలో స్పష్టత లేదు. త్వరలో జరుగుతాయనుకుంటున్న మున్సిపల్ ఎన్నికలైనా జరిగితే ప్రజాభిప్రాయం తెలియటంతో పాటు సామాజికవర్గ సమీకరణల్లో కూడా స్పష్టత వస్తుంది.