మమ్మల్నిలా బతకనీయండి బాబూ!

First Published Jan 12, 2017, 3:31 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలలో ముఖ్యమంత్రులు అన్ని జిల్లాలకు విమానాలునడపుతామంటున్నారు. ప్రజలేమో, వద్దబాబూ మమ్నల్నిలా బతకనీయండి, బస్సేయండి చాలంటున్నారు.

‘విమానాశ్రయం వద్దు, మమ్మల్నిలా బతకనీయండి’ అని విజయనగరం జిల్లా భోగాపురం ప్రజలు  పోలీసులతో,తెలుగుదేశం కార్యకర్తలతో తలపడ్డారు.

 

ప్రజాభిప్రాయ సేకరణ అనే తంతు ముగించేందుకు  ప్రభుత్వం ర్పాటు చేసిన ఈ మొక్కుబడి కార్యక్రమం లో ఉద్రికత్త నెలకొనింది.పోలీసులకు, తెలుగుదేశం కార్యకర్తలకు పెనుగులాట జరిగింది.ఈ కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతుల కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభ ఉద్రిక్తతలు, నిర్బంధాలు, అరెస్టులు, నినాదాల మధ్య గందరగోళంగా సాగింది.

 

ఈ సభలో స్థానికులు తమ అభిప్రాయం చెపాల్సి ఉండగా, తెలుగుదేశం కార్యకర్తలను స్థానికులు రూపంలో మొహరించారు. వారికి పోలీసుల అండ.

 

ఇలా అస్మదీయులతో సభను నిర్వహించేందుకు ప్రయత్నించినా వ్యతిరేకత చవిచూడక తప్పలేదు. స్థానిక  ప్రజలకు అండగా వచ్చిన సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.  పోలీసుల దుందుడుకు తనం, అరెస్టులను నిరసిస్తూ ప్రజలు  ప్రజాభిప్రాయ సభను బహిష్కరించారు. 'పోలీసుల, టిడిపి కార్యకర్తలతో సాగుతున్న ప్రజాభిప్రాయ సేకరణ చెల్లదు'. 'ఎయిర్‌పోర్టు మా కొద్దు' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 

 


భోగాపురం మండలం మరడపాలెంలో జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలతో తూతూమంత్రంగా సభను సాగించాలని ప్రభుత్వం చూసింది.స్థానికులకు రాజకీయ పార్టీల అండఅందకుండా చేసేందుకు మంగళవారం రాత్రి నుంచే ముందస్తు అరెస్టులు మొదలయ్యాయి.

 

 సభాస్థలానికి  వచ్చే దారుల్లో బుధవారం తెల్లవారు జామునుంచే చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి కేవలం తెలుగుదేశం కార్యకర్తలను మాత్రమే అనుమతించడం మొదలుపెట్టారు.

 

సిపిఎం, వైసిపి నాయకులు , స్థానికులయినా నిలిపేసి అదుపులోకి తీసుకున్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శ్రీరామ్మూర్తి, వి.ఇందిరతో పాటు పలువురు నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అభిప్రాయం చెప్పే హక్కు తమకూ ఉందని, వాటిని వినాలని ఎంతకోరినా వినకుండా పోలీసులు వారిని బలవంతంగా జనం మధ్య కొట్టుకుంటూ లాక్కెళ్లి వ్యాన్లలో ఎక్కించారు.

 

 దీంతో ఆగ్రహించిన ప్రజలు సభను బహిష్కరించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టొందంటూ అధికారుల ముందు తేల్చి చెప్పారు. దీనికి ముందు వైసిపి నాయకులు దాట్ల శ్రీదేవి, ఉప్పాడ సూర్యనారాయణ, కాకర్లపూడి శ్రీను రాజు తదితరులను పోలీసులు ఉదయం వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. 

 

అయితే, ఇదే మంచి అవకాశమని అధికారులు ,టిడిపి కార్యకర్తలు పోలీసుల సహాయంతో ప్రజాభిప్రాయ సేకరణ సభను అధికారులు కొనసాగించారు. అక్కడ మట్లాడిని వారిలో కూడా కొంతమంది  ఎయిర్‌పోర్టును వ్యతిరేకించారు. వెయ్యి ఉద్యోగాలు కూడా రాని ఎయిర్‌పోర్టు కోసం లక్షా 30 వేల మంది ప్రజలకు నష్టం చేకూర్చడం తగదంటూ కొంతమంది టిడిపి నాయకులు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు.

 

గతవారంలో తెలంగాణాలో కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వారు విమానాలు కాదు, ముందు బస్సలు నడపండని వారు నినిదిస్తున్నారు.  ఈ ప్రజలకుకోదండరాం నాయకత్వంలోని తెలంగాణా జెఎసి కూడా  మద్దతు తెలిపింది.

click me!