
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు మంత్రి పదవి ఖాయమైంది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు ముహూర్తం కుదరటమే ఆలస్యం. లోకేష్ కు మంత్రి పదవి విషయమై పార్టీలో ఎప్పటి నుండో డిమాండ్లు వినిపిస్తున్నాయి. దానికితోడు చంద్రబాబునాయుడు కూడా ఇంటి పోరు బాగా ఎక్కువైపోయినట్లు సమాచారం దాంతో లోకేష్ కు మంత్రిపదవి తప్పనిసరైంది. అదే విషయాన్నిచంద్రబాబే స్వయంగా వెల్లడించారు.
తెలంగాణా టిడిపి నేతలతో జరిగిన భేటిలో తెలంగాణా పార్టీ బాధ్యతలను లోకేష్ కు అప్పగించే విషయాన్ని నేతలు చంద్రబాబుతో ప్రస్తావించారు. వెంటనే స్పందించిన చంద్రబాబు కుదరదని చెప్పినట్లు సమాచారం. లోకేష్ కు మంత్రి పదవి ఇస్తున్నానని కాబట్టి తెలంగాణాలో పార్టీ బాధ్యతలు అప్పగించటం సాధ్యం కాదని చెప్పారు. దాంతో ఇంతకాలం పార్టీ నేతల నిరీక్షణ ఫలించబోతోంది.
ప్రస్తుత మంత్రివర్గంలోని వారిలో అనేకమందిపై పలు ఆరోపణలున్నాయి. అవినీతికి పాల్పడటం, సమర్ధత లేకపోవటం ప్రధానం. దానికితోడు పార్టీ నేతలకు, కార్యకర్తలకు అసలు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు అదనం. ఇవన్నీ చంద్రబాబు దృష్టలో కూడా ఉన్నాయి. మంత్రివర్గం ఏర్పడి రెండున్నరేళ్లు అయిపోయింది. లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే, ప్రక్షాళన చేస్తారా ? లేదా కేవలం విస్తరణకే పరిమితమవుతారా అన్నది చూడాలి. పలువురిని తొలగించాలని అనుకున్నా సామాజిక సమీకరణల నేపధ్యంలో చంద్రబాబు ధైర్యం చేయలేకపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.