
తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపుల గందరగోళం మొదలైంది. అధికార పార్టీ అభివృద్ధి విధానాలు నచ్చిన వైసీపీ నుండి ఫిరాయించిన నేతల్లో ఒక్కక్కరుగా మళ్ళీ టిడిపిని వదిలేస్తున్నారు. దాంతో టిడిపి నేతల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం కడప మున్సిపాలిటీలో రివర్స్ ఫిరాయింపులు జోరందుకున్నాయి. మిగిలిన జిల్లాల్లో కూడా పలువురు నేతలు మళ్ళీ వైసీపీలోకి వచ్చేసేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారన్న సమాచారంతో నేతల్లో కలవరం మొదలైంది.
కొద్ది రోజుల క్రితం కడప మున్సిపాలిటీకి చెందిన 12 మంది వైసీపీ కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. అదికూడా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలోనే కండువాలు కప్పుకున్నారు. అయితే, ఫిరాయించిన కార్పొరేటర్లకు టిడిపి కార్పొరేటర్లు, నేతల మధ్య ఏమి జరిగిందో తెలీదు. ఫిరాయించిన కార్పొరేటర్లలో ముగ్గురు కొద్ది రోజులకే తిరిగి వైసీపీ గూటికి వచ్చేసారు. టిడిపి నేతలు ఎంత ప్రయత్నించినా వారిని ఆపలేకపోయారు.
టిడిపిలోని వర్గ రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలు, ఫిరాయింపుల సమయంలో ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవటం లాంటి కారణాల వల్లే తాజాగా మరో ఆరుగురు కార్పొరేటర్లు కూడా రివర్స్ ఫిరాయింపులకు సిద్ధపడ్దారు. అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా కార్పొరేటర్లు మళ్లీ వైసీపీలో చేరుతున్నారు. అధికార పార్టీలో ఇమడలేని పరిస్ధితులతో కార్పొరేటర్లు ఉక్కిరిబిక్కిరి అయినట్లు సమాచారం. అదే దారిలో మరికొంత మంది కార్పొరేటర్లు కూడా ఉన్నట్లు సమాచారం. స్ధానిక సంస్ధల ఎన్నికల ముందు ఈ రివర్స్ ఫిరాయింపులు ఊపందుకోవటంతో అధికార పార్టీలో ఆందోళనలు మొదలయ్యాయి.