భాజపా ఆశలు వదిలేసుకుందా?

Published : Feb 03, 2017, 01:20 AM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
భాజపా ఆశలు వదిలేసుకుందా?

సారాంశం

వచ్చే ఎన్నికల్లో ఇపుడున్న సీట్లు కూడా రావనుకుందేమో. అందుకే ఏపి అబివృద్ధిని ఏమాత్రం పట్టిచుకోవటం లేదు.

 

ఆంధ్రప్రదేశ్ పై భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఆశలు వదిలేసుకున్నట్లే కనబడుతోంది. గడచిన రెండున్నరేళ్ళుగా రాష్ట్రప్రయోజనాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని చూస్తుంటే అనుమానాలు వస్తున్నాయి. తాజా బడ్జెట్ గమనిస్తే అనుమానాలు కన్ఫరమ్ అవుతాయి. అడ్డుగోలు రాష్ట్ర విభజనతో యూపిఏ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. ఆ  పేరు చెప్పి రాష్ట్రంలో నాలుగు సీట్లు సంపాదించుకున్న భాజపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజలను మోసం చేస్తోంది.

 

రాష్ట్రంలో టిడిపి, భాజపాలు కలిసి పోటీ చేస్తే వైసీపీని కాదని మిత్రపక్షాలకే అధికారం కట్టబెట్టారు. ఎందుకని? ఎందుకంటే, రెండు పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయని నమ్మి. అయితే అధికారంలోకి వచ్చింది మొదలు ప్రధానమంత్రితో కలిపి కేంద్రమంత్రులు వెంకయ్యనాయడు, జైట్లీ తదితరులు మాటలు చెబుతున్నారే కానీ చేతల్లో మాత్రం శూన్యమే. ఇప్పటి వరకూ రాష్ట్రానికి వచ్చిన అరాకొరా విభజన హామీల్లో ఉన్నవే తప్ప అదనంగా ఇచ్చింది ఏమీ లేదు. పైగా విభజన చట్టంలోని ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, ఆర్ధికలోటు భర్తీ లాంటి వాటిని ప్రధానమంత్రి ఏమాత్రం పట్టించుకోలేదు. సరే, ఇక పోలవరం నిర్మాణం, రాజధాని నిర్మాణానికి నిధులు రాకపోవటమన్నది చంద్రబాబు స్వయంకృతమే.

 

చంద్రబాబు-మోడిల మధ్య సంబంధాలు ఎలాగున్నాయో ఎవరికీ స్పష్టంగా తెలీదు. అయితే రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబు చేస్తున్న విజ్ఞప్తులను మోడి ఏనాడు ఖాతరు చేయలేదని మాత్రం అందరికీ స్పష్టంగా తెలుస్తోంది. అందుకు కారణం చంద్రబాబు ప్రధాని ముందు సాగిలపడటమే. ఓటుకునోటు కేసులో ఇరుకున్న చంద్రబాబు కేంద్రాన్ని నిలదీయలేని స్ధితిలో ఉన్నారు. దానికి తగ్గట్లే తెలంగాణా సిఎం కెసిఆర్తోనూ సఖ్యత లేదు. ఈ రెండు అంశాలను అవకాశంగా తీసుకుని చంద్రబాబును మోడి లెక్కే చేయటం లేదు.

జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపి-భాజపాలు కలిసి పోటీ చేసే విషయమై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. అందుకు లోపాయికారిగా ఎవరి ఏర్పాట్లు వారు చేసుకుంటున్నట్లే కనబడుతోంది. ఈ ఏడాది చివరలో గానీ లేదా వచ్చే ఏడాదిలో గానీ మిత్రపక్షాల మధ్య పొత్తు చిత్తవుతుందని ప్రచారంలో ఉంది. ఈ నేపధ్యంలో ఎంత అభివృద్ధి చేసినా చేసింది మొత్తం చంద్రబాబు ఖాతాలోనే పడుతుందని భాజపా భావిస్తున్నట్లుంది. కాబట్టే రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చూపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇపుడున్న సీట్లు కూడా రావనుకుందేమో. అందుకే ఏపి అబివృద్ధిని ఏమాత్రం పట్టిచుకోవటం లేదు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?