
రాష్ట్రంలో రైతు రుణమాఫీ భారాన్ని కేంద్రానికి తగిలించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతోంది. పోయిన ఎన్నికల్లో రైతు రుణాలను మాఫీ చేస్తానంటూ చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందేకదా? సరే పరిస్ధితులు కలిసి వచ్చి ముఖ్యమంత్రైన తర్వాత చంద్రబాబు రుణాల మాఫికి నానా అవస్తులు పడుతున్నారు. హామీ ఇచ్చినపుడేమో రుణాల మొత్తాలు సుమారు రూ. 87 వేల కోట్లుకు టిడిపి లెక్క చెప్పింది. అయితే, అధికారంలోకి రాగానే అదే లెక్కను రూ. 35 వేల కోట్లకు దించేసింది. ఎందుకంటే, హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోవటమే.
అప్పటి నుండి రుణమాఫీకి చంద్రబాబు నానా అవస్తలూ పడుతున్నారు. ఐదు విడతల్లో మాఫీ అన్నారు. తర్వాత రైతులకు బాండ్లు ఇస్తామన్నారు. బాండ్లు కుదవపెట్టి బ్యాంకుల్లో రైతులు రుణాలు తెచ్చుకోవచ్చని చాలానే చెప్పారు. మొత్తానికి ఇప్పటికి రెండు విడతల్లో సుమారు 10,500 కోట్లు మాఫీ చేసామని అనిపించుకున్నారు. మొన్నటి బడ్జెట్లో మరో రూ. 3600 కోట్లు పెట్టారు. ఇవికాకుండా డ్వాక్రా, చేనేతల రుణాలమాఫీ కూడా ఉంది. అందుకే ప్రభుత్వం కిందా మీదా పడుతోంది.
ఇటువంటి సమయంలోనే కేంద్రమంత్రి ప్రకటన తన నెత్తిన పాలు పోసినట్లు చంద్రబాబు ఫీల్ అవుతున్నారు. వెంటనే తన భారాన్ని కేంద్రం నెత్తిన పెట్టేసేందుకు సిద్ధపడుతున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణా తదితర రాష్ట్రాల విషయంతో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా యూపి విషయంలో కూడా కేంద్రం అనుసరించబోయే విధానామేమిటో చూస్తే కానీ తెలీదు. అందుకే కేంద్ర నిర్ణయం బట్టి పావులు కదపాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఏ చిన్న అవకాశం దొరికినా రైతు రుణమాఫీ భారం మొత్తాన్ని కేంద్రం మెడకు చుట్టేందుకు చంద్రబాబునాయడు సిద్ధంగా ఉన్నారు.