
శాసనమండలి పోలింగ్ ముగిసింది, ఉత్కంఠ మొదలైంది. స్ధానిక సంస్ధల కోటాలోని మూడు స్ధానాల్లో విజయం సాధించేందుకు టిడిపి, వైసీపీ తీవ్రంగా పోటీ పడ్డాయి. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలో తలా ఓ స్ధానం కోసం ఎన్నిక జరిగింది. కడప జిల్లాలో 99 శాతం ఓట్లు పోలయ్యాయి. నెల్లూరులో వంద శాతం పోలింగ్ జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో కూడా 98 శాతం ఓట్లు పోలయ్యాయి. పోటీ మాత్రం ఉత్కంఠత రేపుతోంది.
మూడు స్ధానాల్లోనూ కడప ఎన్నికే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డిని ఓడించి వైఎస్ కంచుకోటను బద్దలు కొట్టాలని టిడిపి ప్రయత్నించింది. దాంతో ఇరు పార్టీల మధ్య పోరు చాలా తీవ్రంగా సాగింది. ఇక, కర్నూలు జిల్లాలో వైసీపీ ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి మృతితో అనుచరులు శిల్పాకు ఓటు వేసేందుకు నిరాకరించినట్లు తెలిసింది. దాంతో టిడిపి అభ్యర్ధి శిల్పా చక్రపాణి రెడ్డిలో ఆందళన మొదలైనట్లు సమాచారం.
ఇక, నెల్లూరులో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. వైసీపీకి చెందిన సుమారు 70 ఓట్లను టిడిపి అభ్యర్ధి వాకాటి నారాయణరెడ్డి తనకు అనుకూలంగా తిప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టిడిపి ఓటర్లతో పాటే వైసీపీ ఓటర్లు కూడా ఒకే బస్సులో పోలింగ్ కేంద్రాల వద్ద దిగినట్లు తెలుస్తోంది. వైసీపీకి స్పష్టమైన మెజారిటి ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ కారణంగా టిడిపి అభ్యర్ధికి గెలుపు అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 20వ తేదీ జరిగే ఓట్ల కౌటింగ్ లో అభ్యర్ధుల భవిష్యత్తు తేలిపోతుంది.