
‘రవాణాశాఖ అవినీతితో నిండిపోయింది’..ఇది ఎవరో ప్రతిపక్ష నేత చేసిన ఆరోపణ కాదు. సాక్ష్యాత్తు అధికార పార్టీ అదికూడా రాజధాని ప్రాంతమైన విజయవాడ ఎంపి కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు. ఎంపి చేసిన వ్యాఖ్యలు పార్టీ, ప్రభుత్వంలో ఇపుడు సంచలనంగా మారింది. అధికార పార్టీ ఎంపిగా ఉండి రవాణాశాఖ అవినీతితో నిండిపోయిందని వ్యాఖ్యలు చేయటాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకున్నారు.
ఈరోజు ఎంపి మీడియాతో మాట్లాడుతూ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం రాష్ట్రానికి చెందిన 900 బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తే ఏపి రవాణా శాఖ ఉన్నతాధికారులకు మాత్రం చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. రవాణా శాఖ మొత్తం అవినీతిమయంగా మారిపోయిందంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. అక్కడ రద్దయిన బస్సులను మన రాష్ట్రంలో ఎలా తిరగనిస్తున్నారంటూ ప్రశ్నించారు.
ఒక ఎంపి లేఖను గౌరవించి అరుణాచల్ ప్రదేశ్ అధికారులు, ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి స్పందిస్తే...రాష్ట్రంలోని అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ ఎంపి ఎద్దేవా చేసారు. నిబంధనల ప్రకారం బస్సులు తిప్పుతున్న యాజమాన్యాలంతా అధికారుల తీరుతో నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసారు. ఇంతకీ ఎంపి అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నట్లా లేక ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్లా?