
రైతుల్లోని అసంతృప్తిని చంద్రబాబునాయుడు గుర్తించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా? లక్షల సంఖ్యలో ఉన్న అన్నదాతల కుటుంబాలను మచ్చిక చేసుకోవాలని అనుకున్నారు. అందుకనే రుణమాఫీని ఒకేసారి చేస్తే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఇటీవలే ప్రభుత్వం రైతు రుణమాఫీతో పాటు అనేక అంశాలపై సర్వే చేయించింది. రుణాలు మాఫీ కానీ రైతు కుటుంబాల్లో బాగా అసంతృప్తి ఉన్నట్లు గుర్తించింది.
పోయిన ఎన్నికల్లో గెలుపే లక్ష్యంతో చంద్రబాబు రైతులకు, డ్వాక్రా సంఘాలు, చేనేత కార్మికుల రుణాలమాఫీకి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో సుమారు 90 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తామని టిడిపి చెప్పింది. అయితే, అధికారంలో రాగానే ప్లేటు ఫిరాయించింది. రుణమాఫీకి అనేక నిబంధనలు తెరపైకి తెచ్చింది. నిబంధనల ప్రకారం మాఫీ చేయాల్సిన మొత్తం సుమారు రూ. 36 వేల కోట్లకు తగ్గిపోయింది. దాంతో రైతుల్లో అసంతృప్తి మొదలైంది.
అంతేకాకుండా రుణమాఫీని విడతలవారీగా చేస్తామన్నారు. అంతేకాకుండా రుణమాఫీ ప్రక్రియనే ఎవరికీ అర్ధం కాకుండా చేసేసారు. రూ. 50వేల లోపు రుణాలున్న రైతులకు ఒకేసారి, రూ. 50 వేల నుండి రూ. 1.5 లక్షల వరకూ ఉన్న రైతులకు ఐదువిడతల్లో రుణమాఫీ చేస్తానని చెప్పటంతో రైతుల్లో అయోమయం మొదలైంది. మొత్తానికి రైతు రుణామఫీ ప్రక్రియ ఒక బ్రహ్మపదార్ధం తయారైంది. ఇప్పటి వరకూ ఎంత రుణమాఫీ అయ్యిందో స్పష్టంగా ఎవరూ చెప్పలేని పరిస్ధితి.
ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం చేయించిన సర్వేలో విడతల వారీగా రుణమాఫీ అందుకుంటున్న రైతుకుటుంబాల్లో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు బయటపడింది. దాంతో వెంటనే చంద్రబాబు మేల్కొన్నారు. మూడో విడత రుణమాఫీ త్వరలో చేసేసి మిగిలిన రెండు విడతలను ఒకేసారి చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ ఆలోచన చేస్తున్నారన్నది స్పష్టం. రైతుల ఆగ్రహానికి గురైతే ఏం జరుగుతుందో చంద్రాబాబుకు బాగా తెలుసు. ఒకే విడతలో రుణమాఫీ చేసినా రైతులు చంద్రబాబుకు సానుకూలంగా ఉంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.