విశాఖ కూడా కమ్మరాజ్యమే.. జగన్ వల్ల వాళ్లకు రెండు రాజధానులు: కొడాలి నాని

By Siva KodatiFirst Published Jan 20, 2020, 5:15 PM IST
Highlights

చంద్రబాబు డబ్బా మీడియా, చెత్త పేపర్లలో ఏదో టేప్ పెట్టి కొలిచినట్లుగా అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందని రాజధాని పెట్టామంటున్నారని విమర్శించారు మంత్రి కొడాలి నాని. 

చంద్రబాబు డబ్బా మీడియా, చెత్త పేపర్లలో ఏదో టేప్ పెట్టి కొలిచినట్లుగా అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందని రాజధాని పెట్టామంటున్నారని విమర్శించారు మంత్రి కొడాలి నాని. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉందా, దూరంగా ఉందా కదా అన్నది ప్రధానం కాదన్నారు.

ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబై నగరాలు రాష్ట్రానికి మధ్యలో ఉన్నాయా అని కొడాలి ప్రశ్నించారు. పుణ్యక్షేత్రంగా, చారిత్రక నగరంగా ఉన్న అసలైన అమరావతిని ఎండబెట్టి, పాడుపెట్టేశారని.. ఇది చంద్రబాబు సృష్టించిన అమరావతని ఎద్దేవా చేశారు.

రాజధానిని నిర్మిస్తానని చంద్రబాబు గ్రాఫిక్స్‌లు చూపించారని.. చివరికి ఏం చేయలేక అసెంబ్లీలో ఒప్పుకున్నందున అమరావతిని పూర్తి చేయాలని ఒత్తిడి తేవడం దారుణమని మంత్రి అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు అమరావతి రాజధానిగా నిర్ణయించడానికి శతాబ్ధాల ముందే రాజకీయంగా, ఆర్ధికంగా, పారిశ్రామికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాయని మంత్రి గుర్తుచేశారు.

Also Read:మూడు రాజధానులను నిరసిస్తూ రామవరం జాతీయ రహదారిపై రాస్తారోకో

విశాఖపట్నానికి రాజధాని వెళితే.. కమ్మ సామాజిక వర్గానికి వచ్చిన నష్టం ఏం లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా మంచివారని, రాష్ట్రం నుంచి ఎవరు వెళ్లినా వారు ఆదరిస్తారని కొడాలి నాని తెలిపారు. కమ్మ వాళ్లకి ఇప్పుడు అమరావతితో పాటు విశాఖతో కలిపి రెండు రాజధానులు వచ్చాయని నాని గుర్తుచేశారు. బెదిరిస్తే.. బ్లాక్ మెయిల్ చేస్తే బెదిరిపోవడానికి అక్కడుంది జగన్మోహన్ రెడ్డని కొడాలి నాని వెల్లడించారు. స్థానిక ఎన్నికలపై టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లకపోతే ఎన్నికలు జరిగేవన్నారు.  

అమరావతిని రాజధానిగా తరలించడం లేదని, శాసనసభను ఇక్కడే ఉంచి వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ది చెందాలనే ఉద్దేశ్యంతో మూడు ప్రాంతాల్లో రాజధానులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు కర్నూల్‌కి వెళితే మూడు జిరాక్స్ మిషన్‌లు వెళతాయని చెబుతున్న వారు మరి దానిని వదిలి వేయొచ్చు కదా అని కొడాలి ఎద్దేవా చేశారు.

జనం ఎంతో తెలివైన వారని రెచ్చగొడితేనో, జోలి పెట్టి భిక్షాటన చేస్తేనో సింపతి రాదని నాని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్నో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయని వాటిని కూడా అభివృద్ధి చేయాలని కొడాలి నాని కోరారు. విజన్ 2020కి చంద్రబాబుకు 20 మంది ఎమ్మెల్యేలు మిగిలారని నాని సెటైర్లు వేశారు.

Also Read:అసెంబ్లీలో వైఎస్ జగన్ కునుకు: ఈ మనిషికి అంటూ నారా లోకేష్ ట్వీట్

తెలంగాణవాదం లేదని అంటే కేసీఆర్ రెండు సార్లు రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లి సంచలన విజయాలు నమోదు చేశారని ఆయన గుర్తుచేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ 21 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని నాని సవాల్ విసిరారు.

దేవుడు తనకు వరమిస్తే రాజశేఖర్ రెడ్డి లాంటి మరణం కావాలని కోరుకుంటానని, చనిపోయి కూడా ఈ రోజుకి కూడా ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి వైఎస్ అని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు కన్నకొడుకుని కూడా గెలిపించుకోలేకపోయాడని నాని అన్నారు. 
 

 

click me!