సుబ్రమణ్యం మృతి కేసు .. ఎంతటి వారైనా వదిలేది లేదు, కఠిన చర్యలు తప్పవు : మంత్రి మేరుగు నాగార్జున

By Siva KodatiFirst Published May 22, 2022, 3:32 PM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు మాజీ కారు డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసులో నిందితులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు మంత్రి మేరుగు నాగార్జున. చంద్రబాబు దళితులను రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ  అనంతబాబు (ysrcp mlc anantha uday babu) మాజీ కారు డ్రైవర్ సుబ్రమణ్యం మృతి కేసులో (subramanyam death case) నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి మేరుగు నాగార్జున. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని సీఎం జగన్ ఆదేశించారని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దళితుల్ని రెచ్చగొడుతున్నారని.. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు మాట్లాడినప్పుడు ఈ గొంతులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. 

అంతకుముందు సుబ్రమణ్యం (subramanyam) కుటుంబ సభ్యులను టీడీపీ (tdp) అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) పరామర్శించారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యం భార్యను ఆయన ఓదార్చారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. కళ్లముందు నిందితుడు ఎమ్మెల్సీ అనంతబాబు పెళ్లిళ్లకు, ఫంక్షన్లకు వెళ్తున్నా అరెస్ట్ చేయకపోవడం విడ్డూరంగా వుందన్నారు. టీడీపీ, దళిత సంఘాల పోరాటం వల్లే.. సుబ్రమణ్యం మృతిని హత్య కేసుగా నమోదు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ కేసును సీబీఐతో (cbi) విచారణ జరిపించాలని సుబ్రమణ్యం భార్య అపర్ణ కోరుతున్నారని ఆయన తెలిపారు. 

మరోవైపు సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ శనివారం అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్‌లో నిర్వహించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. ఇక, సుబ్రహ్మణ్యం మృతి కేసులో పోలీసులు ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకుంటామని అర్ధరాత్రి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రకటించారు. అనుమానాస్పద మృతి కేసు నుంచి హత్య కేసుగా మార్చినట్టుగా వెల్లడించారు. 

Also Read:వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అరెస్ట్‌కు రంగం సిద్దం..!

అయితే సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ ప్రాథమిక నివేదికలో అతడిని కొట్టి చంపినట్టుగా తేలిందని సమాచారం. మృతుడి బట్టలపై బీచ్‌లో మట్టి, ఇసుక.. ఒంటిపై కాళ్లతో తన్నిన గుర్తులు, తల మీద ఎడమవైపు గాయం ఉన్నట్టుగా వైద్యులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎడమ కాలు బొటన వేలుపై, కుడి కాలు మడెం దగ్గర, ఎడమ చేయి, పై పెదవిపై గాయాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారని సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉదయభాస్కర్‌ ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. మరోవైపు అనంత ఉదయభాస్కర్ ముందస్తు బెయిల్‌కు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఇక, ఈ కేసులో ఉదయభాస్కర్‌ను అరెస్ట్ చేయాలని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తొలి నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరికి మద్దతుగా పలు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు కాకినాడ జీజీహెచ్ వద్ద నిరసనకు దిగారు. సుబ్రహ్మణ్యం మృతిపై టీడీపీ ఏర్పాటు చేసిన నిజనిర్దారణ కమిటీ.. కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో శనివారం సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు, అపర్ణ శనివారం పగలు కనిపించకుండా పోయారు. 
 

click me!