అనంతపురంలో కరువే లేదట....

First Published Jun 25, 2017, 9:03 AM IST
Highlights

చిలమత్తూరు మండలానికి వచ్చిన మంత్రిని పలువురు స్ధానిక ప్రజాప్రతినిధులు కలిసారు. ఆ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, నిత్యం కరువుతో అల్లాడుతున్న గ్రామీణ ప్రాంతాలను ఆదుకోవటానికి హంద్రీ-నీవా కాలువను పూర్తి చేయాలని కోరారు.

అనంతపురం జిల్లా అంటే ముందు కరువే గుర్తుకు వస్తుంది ఎవరికైనా. వర్షాభావ పరిస్ధితులు, భూగర్భజలాలు అడుగంటిపోవటం లాంటి వాటితో జిల్లా కరువుతో అల్లాడిపోతోంది. అందుకనే జిల్లాలోని 63 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఇది వాస్తవం. కానీ శనివారం జిల్లలాలో పర్యటించిన ఆబ్కారీ శాఖ మంత్రి జవహర్ కు మాత్రం జిల్లాలో కరువే కనబడలేదట.

జిల్లాలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణతో సహా వచ్చారు. నియోజకవర్గంలోని చిలమత్తూరు మండలానికి వచ్చిన మంత్రిని పలువురు స్ధానిక ప్రజాప్రతినిధులు కలిసారు. ఆ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, నిత్యం కరువుతో అల్లాడుతున్న గ్రామీణ ప్రాంతాలను ఆదుకోవటానికి హంద్రీ-నీవా కాలువను పూర్తి చేయాలని కోరారు. అందుకు మంత్రి స్పందిస్తూ ‘జిల్లాలో కరువా...ఎక్కడుంది? తనకెక్కడా కనబడలేదే’ అని చేసిన వ్యాఖ్యతో అందరూ ఆశ్చర్యపోయారు.

‘ఎంఎల్ఏ బాలకృష్ణ చేపట్టిన పనులతో కరువు పారిపోయింది కాబట్టి ఇక్కడ కరువే లేద’న్నారు. మంత్రి సమాధానంతో సమావేశానికి వచ్చిన వారంతా ముందు బిక్కమొహం వేసారు, తర్వాత ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లాలో కరువే లేకపోతే మరి ప్రభుత్వం 63 మండలాలను కరువుగా ఎందుకు ప్రకటించిందని ఎవరికి వారు ప్రశ్నించుకున్నారు.

click me!