చంద్రబాబు చల్లగా వుండాలనే కోరుకుంటున్నాం..: మంత్రి బొత్స సత్యనారాయణ 

By Arun Kumar P  |  First Published Nov 2, 2023, 6:43 AM IST

చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదలవడంతో టిడిపి శ్రేణుల సంబరాలు చేసుకోవడంపై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేసారు. నిర్దోషిగా కాదు... ఒంట్లో కంట్లో బాలేదని చెప్పి బయటపడ్డాడని గుర్తుంచుకోవాలన్నారు. 


అమరావతి : ఆంధ్ర  ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నానంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుకు ఒంట్లో బాలేదని... కంట్లో బాలేదని చెప్పి బెయిల్ పొందారు... అంతేగాని అవినీతి కేసుల్లో నిర్దోషిగా బయటకు రాలేదని అన్నారు. ఇంతదానికే తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం ఎందుకో అర్థంకావడంలేదని మంత్రి బొత్స అన్నారు. 

చంద్రబాబు ఆరోగ్యంగా వుండాలని తాము కూడా కోరుకుంటున్నామని బొత్స పేర్కొన్నారు. కానీ చట్టం తన పని చేసుకుపోతుందని... చంద్రబాబు దీనికి అతీతమేమీ కాదని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన చంద్రబాబు తగిన శిక్ష అనుభవించక తప్పదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

Latest Videos

 Read More చంద్రబాబు కేసులో వైఎస్ జగన్ కు తెలుగుదేశం పార్టీ సూటి ప్రశ్నలు..

ఇదిలావుంటే రాజమండ్రి సెంట్రల్ జైలునుండి బయటకు వచ్చిన చంద్రబాబు హైదరాబాద్ కు చేరుకున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స పొందనున్నారు.  అలాగే  మరో హాస్పిటల్లో కంటి పరీక్ష చేయించుకోన్నారు. 

అనారోగ్య కారణాలతో బెయిల్ పొందిన చంద్రబాబు రాజకీయాలకు దూరంగా వుండనున్నారు. ఏపి హైకోర్టు కూడా కేవలం చికిత్స కోసమే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. బెయిల్ షరతులను చంద్రబాబు తప్పకుండా పాటించాలని... నిబంధనలు ఉళ్ళంఘించరాదని హెచ్చరించింది. 
 

click me!