జైల్లోంచి ఖైదీ బయటకు వస్తుంటే సంబరాలా..! : చంద్రబాబు విడుదలపై అంబటి సెటైర్లు  

By Arun Kumar P  |  First Published Oct 31, 2023, 1:39 PM IST

చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. వీటిపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేసారు. 


గుంటూరు : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు 53 రోజులతర్వాత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలునుండి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకోవడంపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేసారు. 

ఓ ఖైధీ జైలు నుండి బయటకు వస్తుంటే టిడిపి నాయకులు సంబరాలు జరుపుకోవడం దారుణమని అంబటి సెటైర్లు వేసారు. చంద్రబాబుకు బెయిల్ మాత్రమే వచ్చింది... ఇంతదానికే న్యాయం గెలించిది, ధర్మం గెలిచింది అంటూ పెద్దపెద్దమాటలు అనడం తగదన్నారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని కోర్టు తేల్చిన తర్వాత విడుదలయితే అప్పుడు సంబరాలు జరుపుకుంటే బాగుండేదని మంత్రి అంబటి అన్నారు. 

Latest Videos

అనారోగ్యంతో బాధపడుతున్నాడని కోర్టు నమ్మి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిందని అంబటి తెలిపారు. కంటి వైద్యం చేయించుకుంటానంటే హైకోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. ఇది కేవలం నాలుగు వారాల పాటేనని  టిడిపి నాయకులు గుర్తించాలన్నారు. జైల్లో ఏసి అనుమతిస్తారు... కానీ కంటి వైద్యం చెయ్యలేరు కదా... అందువల్లే బెయిల్ ఇచ్చారని అంబటి తెలిపారు. 

Read  చంద్రబాబుకు బెయిల్... టపాసులు కాలుస్తూ, మిఠాయిలు పంచుకుని టిడిపి సంబరాలు

స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడని ఇప్పటికీ చెబుతామన్నారు మంత్రి. నిజంగానే ఆయన ఏ తప్పూ చేయకుంటే విచారణను ఎదుర్కోవాలని... కోర్టును నమ్మించి కేసు కొట్టివేయించుకోవాలన్నారు.  అలాకాకుండా నిబంధనలు పాటించలేదని... అనారోగ్యంతో వున్నానని చెప్పి బెయిల్ తెచ్చుకుని బయటకు వస్తుంటే సంబరాలు జరుపుకోవడం ఎందుకోనని ప్రశ్నించారు.

చంద్రబాబు అరెస్ట్,  బెయిల్ మంజూరుపై టిడిపి నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అంబటి అన్నారు. ఇలా వైసిపి ప్రభుత్వంపై, సీఎం జగన్ పై ఇష్టమొచ్చినట్లు వాగి ఊరుకోబోమని... తగిన రీతిలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని టిడిపి నాయకులకు అంబటి సూచించారు. 

ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీకి దూరంగా వుండాలన్ని టిడిపి నిర్ణయంపై అంబటి సెటైర్లు వేసారు. ఇప్పటికే తెలంగాణలో జెండా పీకేసారు... ఇలాగే రాబోయే రోజుల్లో ఏపీలోనూ టిడిపి జెండా పీకేసే పరిస్థితి వస్తుందన్నారు. ఎన్టీఆర్ ను చంపినట్లుగానే ఆయన స్థాపించిన టిడిపిని కూడా చంద్రబాబు నాయుడు చంపేపాడని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. 

click me!