
Fire Accident : ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా బస్సుకు మంటలు అంటుకోవడంతో భారీగా ప్రాణాపాయం జరిగినట్లు తెలుస్తోంది. 20 మందికి పైగా ప్రయాణికులు చనిపోగా మరికొందరు తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది.
కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు వద్ద హైదరాబాద్-బెంగళూరు హైవేపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణంలో ఉండగా తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. మొదట బస్సు ముందుభాగంలో మంటలు అంటుకోవడంతో డ్రైవర్ తో పాటు ఇతర సిబ్బంది, కొందరు ప్రయాణికులు గమనించి ఎమర్జెన్సీ విండోస్ బ్రేక్ చేసి తప్పించుకున్నారు. అయితే మిగతా ప్రయాణికులు నిద్రలేచి తేరుకునేలోపే బస్సు మొత్తాన్ని మంటలు వ్యాపించాయి. వాళ్లు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో సజీవదహనం అయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్నవెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్దమైపోయింది. వెంటనే గాయాలతో బైటపడ్డ క్షతగాత్రులను కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదసమయంలో బస్సుల్లో మొత్తం 40 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ బస్సు ప్రమాదంపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంగురించి తెలిసి షాక్ కు గురయ్యానని... ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. గాయపడినవారితో పాటు ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని... తగిన సహాయం అందిస్తుందని ఎక్స్ వేదికన ప్రకటించారు సీఎం చంద్రబాబు.