
YS Jaganmohan Reddy : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినీనటుడు, టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అసెంబ్లీలో తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తూ... తాగిన మైకంలో బాలకృష్ణ అలా మాట్లాడారని అన్నారు. అసెంబ్లీకి తాగిరావడంతో పాటు మాజీ ముఖ్యమంత్రినైన తనగురించి నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మాటలను బట్టే బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏమిటో అర్థమవుతుందంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.
అయితే తాగిన వ్యక్తిని పవిత్రమైన అసెంబ్లీలో ఎలా రానిచ్చారు.. ముందు అసెంబ్లీ స్పీకర్ కు బుద్దిలేదని మండిపడ్డారు జగన్. అసెంబ్లీలో పనీపాట లేని సంభాషణలకు కేంద్రంగా మార్చారు.. అసలు శాసనసభలో మాట్లాడాల్సింది ఏమిటి? బాలకృష్ణ మాట్లాడిందేమిటి? అని అడిగారు. బాలకృష్ణ పనీపాటలేని సంభాషణలు చేశారన్నారు వైఎస్ జగన్.
నకిలీ మద్యం కేసుపై మాట్లాడేందుకు మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై విరుచుకుపడ్డారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తీరును ఖండించడమే కాదు స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. ఇదే సమయంలో అసెంబ్లీ స్పీకర్ పైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్లలో ఎలా వ్యవహరించారన్నదానిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జనసేన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సినిమావాళ్లకు జగన్ చేసిన అవమానం గురించి ప్రస్తావించారు. హీరో చిరంజీవి వల్లే జగన్ కొంత తగ్గారు అన్నట్లుగా జనసేన ఎమ్మెల్యే మాట్లాడారు.
కామినేని వ్యాఖ్యలపై సభలోనే ఉన్న బాలకృష్ణ రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే జగన్ ను నిండు సభలో 'సైకోగాడు' అంటూ సంభోధించారు. అంతేకాదు చిరంజీవి గురించి కూడా అభ్యంతరకంగా మాట్లాడారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి వెంటనే స్పందించగా వైఎస్ జగన్ తాజాగా రియాక్ట్ అయ్యారు. అయితే గతంలో వైఎస్ జగన్ గురించి బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ కాగా ఇప్పుడు మాజీ సీఎం కామెంట్స్ సోషల్ మీడియాాలో చక్కర్లు కొడుతున్నాయి.