
కర్నూలు జిల్లాకు సంబంధించి నిజంగా ఇది టిడిపికి పెద్ద షాకే. జిల్లాలో బాగా పేరున్న కోట్ల కుటుంబం త్వరలో వైసీపీలో చేరనున్నది. కాంగ్రెస్ పార్టీ శిధిలావస్తకు చేరుకోవటం, టిడిపిలోకి వెళ్ళేందుకు ఇష్టపడకపోవటంతో ఇంతకాలం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుంటుంబం స్తబ్దుగా ఉన్నది. అయితే స్ధానిక సంస్ధల కోటా ఎంఎల్సీ ఎన్నికల సందర్భంగా మళ్ళీ క్రియాశీలకమవ్వాలని నిర్ణయించుకున్నారు. అందుకే వైసీపీ అభ్యర్ధి గౌరు వెంకట్ రెడ్డికి కోట్ల మద్దతు ప్రకటించారు.
టిడిపి అక్రమాలు పెరిగిపోయాయని, అడ్డుకోకపోతే కష్టమని చెప్పారు. గౌరు, అనంత వెంకట్రామరెడ్డిలతో కలిసి మీడియాతో కోట్ల మాట్లాడారు. దాంతో కోట్ల కుంటుంబం త్వరలో వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం నిజమన్నది తేలిపోయింది. అయితే, కోట్ల కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకెళ్ళటానికి చాలా కాలలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కొడుకు రాఘవేంద్రరెడ్డి, భార్య సుజాతమ్మ త్వరలో వైసీపీలో చేరనున్నారు.
మున్సిపల్ ఎన్నికలు గనుక జరిగితే కోట్ల రాఘవేంద్రరెడ్డి కర్నూలు మేయర్ అభ్యర్ధిగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. అలాగే, సుజాతమ్మ వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంఎల్ఏగా పోటీ చేయవచ్చు. సూర్యప్రకాశ్ రెడ్డి మాత్రం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోట్ల నిర్ణయంతో టిడిపికి పెద్ద షాకే అని చెప్పవచ్చు. ఎందుకంటే, జిల్లాలోని కర్నూలు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో కోట్ల కుటుంబానికి మంచి పట్టుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల్లోని బలమైన బలమైన వర్గాలను మెల్లిగా పార్టీలోకి చేర్చుకోవటం ద్వారా చాపక్రిందనీరులా విస్తరిస్తున్నారు.