కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన సూచనలను తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన సూచనలను తాను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ మేరకు శుక్రవారం ఓ వీడియో విడుదల చేసిన ఆయన గురువారం నాడు జాతినద్దేశించి ప్రధాని చేసిన సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
వచ్చే ఆదివారం మోడీ చెప్పినట్లు జనతా కర్ఫ్యూగా పాటిద్దామని పవన్ పిలుపునిచ్చారు. ఆ రోజు ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇళ్లకే పరిమితమవుదామని అన్నారు.
undefined
Also Read:కరోనాను ఇక తేలికగా తీసుకోలేం.. జనతా కర్ఫ్యూ పాటించండి: మోడీ
కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి గాను ప్రమాదమని తెలిసినప్పటికీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్, వైద్య ఆరోగ్య సిబ్బంది, మీడియా, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రతి ఒక్కరికీ మనస్సులోనే కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధాని చెప్పినట్లు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మన ఇంటి బాల్కనీలో నిలబడి కరతాళ ధ్వనుల ద్వారా వారికి మన సంఘీభావం తెలుపుదామని పవన్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అమెరికాలో చూసిన తన అనుభవాన్ని పవన్ ప్రజలతో పంచుకున్నారు. 2001 సెప్టెంబర్ 11న ట్వీన్ టవర్స్‌ను టెర్రరిస్టులు కూల్చి వేసినప్పుడు మరణించిన వారికి అంజలి ఘటించడానికి అమెరికన్లందరూ ఒకేసారి రోడ్లపైకి వచ్చి మృతులకు సంతాపం తెలిపారని జనసేనాని అన్నారు.
ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని.. ఇది అమెరికన్ల కార్యక్రమం అయినప్పటికీ తోటి మనిషిగా తాను పలుపంచుకున్నానని పవన్ తెలిపారు. సామాజిక సంఘీభావ కార్యక్రమంలో మనమందరం మమేకమవడం మన విధిగా భావిస్తానన్న ఆయన.. మోడీ పిలుపునకు దేశమంతా స్పందించాలని కోరుకుంటున్నానని అన్నారు.
Also Read:కనికా కపూర్‌కు కరోనా : ఆ ప్రముఖులకు వెన్నులో వణుకు.. హోమ్ క్వారంటైన్‌లో వసుంధర రాజే
తాను సైతం ఆ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఫేస్‌బుక్ లైవ్ నిర్వహిస్తానని వెల్లడించారు. అయితే ఈ జనతా కర్ఫ్యూలో సినీ పరిశ్రమకు చెందినవారు కూడా పాల్గొనాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
తెలుగు చిత్ర పరిశ్రమ సైతం జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించాలని జనసేనాని కోరారు. ప్రతి ఒక్క హీరో, హీరోయిన్, నటీనటులు, 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన ప్రతి ఒక్కరూ దీనిలో పాల్గొనాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.