విశాఖలో కరోనా మరణం... వదంతులపై స్పందించిన జవహర్ రెడ్డి

By Arun Kumar PFirst Published Mar 20, 2020, 4:52 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తిపై జరుగుతున్న  తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తుంటే దాన్ని మరింత పెంచుతున్నాయి సోషల్ మీడియా వదంతులు. ఇప్పటివరకు అధికారికంగా కేవలం 3కేసులు మాత్రమే నమోదవగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. కానీ  సోషల్ మీడియాలో ఈ వైరస్ బారిన పడిన ఓ వృద్దురాలు మృతిచెందినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు ఒక్కటికూడా కరోనా మరణం నమోదు కాలేదన్నారు. అయితే తాజాగా ఈ వైరస్ బారిన పడిన విశాఖపట్నానికి చెందిన వ్యక్తి మృతిచెందినట్లు రాష్ట్రంలో ప్రచారం జరుగుతోందని... ఇలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. రాష్ట్ర వైద్యారోగ్య విభాగం అందించే సమాచారమే అధికారికమన్నారు. 

విశాఖలో కరోనా బాదితుడికి ఐసోలేషన్ వుంచి చికిత్స అందిస్తున్నామని.... ఆరోగ్యం నిలకడగానే వుందన్నారు. ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించే ఇలాంటి వదంతులను ప్రచారం చేయవద్దని జవహర్ రెడ్డి సూచించారు. 

 read more నిత్యావసరాల రేట్లు పెంచితే కఠిన చర్యలు: వ్యాపారులకు జగన్ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు మూడు కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో మస్కట్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. అలాగే లండన్ నుంచి ఒంగోలు వచ్చిన ఓ యువకుడికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కాగా మక్కా నుంచి విశాఖపట్నం వచ్చిన ఓ వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు తేలింది. 

కొవిడ్ -19 (కరోనా) వైరస్ నిరోధక చర్యలపై  రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా విశాఖపట్నంలో ఒక కోవిడ్-19 పోజిటివ్ కేసు నమోదయ్యిందని వెల్లడించింది. 

ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొవిడ్ -19 పాజిటివ్ బాధితులు కోలుకుంటున్నారని కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. సోషల్ మీడియాలో  వదంతుల్ని నమ్మొద్దని, కొవిడ్-19 వార్తల విషయంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. విదేశాల నుండి ఏపీకి తిరిగి వచ్చిన వారందరికీ స్వీయ గృహ నిర్బంధ నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. దాన్ని అతిక్రమిస్తే 'ఏపీ ఎపిడమిక్ డిసీజ్ కొవిడ్-19, 2020 ఐపిసి సెక్షన్ 188' ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

మాస్కులు , శానిటైజర్ల  కొరత లేదని, కొవిడ్-19 వైరస్ నియంత్రణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నామని, పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. కొవిడ్ -19 వైరస్ అనుమానితుల సమాచారాన్ని కంట్రోల్ రూం నంబరు ( 0866-2410978)కి తెలియజేయాలని సూచించారు.

read more  రాజధాని ఉద్యమంపై కరోనా ఎఫెక్ట్... రైతు నాయకులకు పోలీస్ నోటీసులు       

వెంటనే సమీప ప్రభుత్వాసుపత్రిని సంప్రదించాలని, వైద్య సలహాల కోసం 104 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని చెప్పారు. కొవిడ్ -19 ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికొచ్చిన 966 మంది  ప్రయాణికుల్ని గుర్తించామని చెప్పారు. 677 మంది ఇళ్లలోనే  వైద్యుల పరిశీలనలో ఉన్నారని అన్నారు. 258 మందికి 28 రోజుల పరిశీలన పూర్తయ్యిందని తెలిపారు. 

31 మంది ఆసుపత్రిలో  వైద్యుల పరిశీలనలో ఉన్నారని, 119 మంది నమూనాలను ల్యాబ్ కు పంపగా 104 మందికి నెగటివ్ వచ్చిందిని చెప్పారు. 12 మంది శాంపిళ్లకు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని జవహర్ రెడ్డిచెప్పారు. కొవిడ్-19 ప్రభావిత దేశాల  నుండి వచ్చిన ప్రయాణికులకు వ్యాధి లక్షణాలున్నా, లేకపోయినా 14రోజులపాటు ఇళ్లల్లోనే ఉండాలని, బయటికి వెళ్లకూడదని సూచించారు. 

కుటుంబ సభ్యులతోగానీ , ఇతరులతో గానీ కలవకూడదుని, 108 వాహనంలోనే ఆసుపత్రికి వెళ్లాలని జవహర్ రెడ్డి అన్నారు. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేసినట్లు జవహర్ రెడ్డి తెలిపారు.
 

click me!