
విశాఖపట్నం :మూడు రాజధానులంటూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మారిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ఉన్న రాజధానిని నాశనం చేసారని... దీంతో అమరావతిని కూడా రాజధానిగా చెప్పుకునే పరిస్థితి లేదంటున్నారు. ఏపీ రాజధాని ఏదంటే రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలో అర్ధంకావడం లేదంటూ వైసిపి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తుంటాయి. ఇలా తాజాగా రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం-సుస్వాగతం అంటూ విశాఖలో ఏర్పాటుచేసిన ప్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 3న అంటే రేపు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వ మూడు రాజధానుల నిర్ణయంతో ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మారిందంటూ జన జాగరణ సమితి వినూత్నంగా నిరసన తెలిపేందుకు సిద్దమయ్యింది. వైసిపి ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇంటికి సీఎం జగన్ వెళ్ళే అవకాశాలుండటంతో ఆ దారిలో రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కు స్వాగతం అంటూ ప్లెక్సీలు ఏర్పాటుచేసారు. ఇలా విశాఖలో జన జాగరణ సమితి సీఎం జగన్ పై సెటైర్లు విసురుతూ ఏర్పాటుచేసిన ప్లెక్సీలు దుమారం రేపుతున్నాయి.
వీడియో
ఈ ప్లెక్సీల ఏర్పాటుపై జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ... రాజధాని లేకుండానే రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేసారు. ఇంత గొప్ప రికార్డ్ సాధించిన జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా సన్మానించాలని... 'క్యాపిటల్ లెస్ సీఎం' బిరుదు ఇవ్వాలంటూ వాసు సెటైర్ వేసారు.
Read More అందరిముందే నిలదీసారని... చెంప చెళ్లుమనిపించిన వైసిపి ఎమ్మెల్యే (వీడియో)
అమరావతిలో కాపురం పెట్టిన సీఎం జగన్ అక్కడి రైతులు కుటుంబాలను రోడ్డున పడేసారని... ఇప్పుడు విశాఖలో కాపురం పెడతానంటున్నాడని వాసు అన్నారు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి జగన్ కాపురం విశాఖలో పెడతానంటున్నాడని ఉత్తరాంధ్ర ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు సీఎం జగన్ ను, వైసిపి ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదని జన జాగరణ సమితి కన్వీనర్ పేర్కొన్నారు.
ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే విశాఖలో అభివృద్ది పనుల పేరిట హడావుడి చేస్తున్నారని... ఇందుకోసమే రేపు బోగాపురం విమానాశ్రయం, అదాని డాటా సెంటర్, మూలపేట పోర్టు లకు శంకుస్థాపన చేస్తున్నారని వాసు అన్నారు. రాజకీయాల కోసమే విశాఖకు ఏదో చేస్తున్నట్లు హడావుడి చేస్తున్న జగన్ నిజస్వరూపం బయటపెడతామని... ఉత్తరాంధ్ర వాసులను జాగృతం చేస్తామని జన జాగరణ సమితి కన్వీనర్ వాసు వెల్లడించారు.