
రాజధాని రైతుల మద్దతు కూడగట్టేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పర్యటించనున్నారు. చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తేవటమే జగన్ వ్యూహంగా కనబడుతోంది. రాజధాని పేరుతో భూములను కోల్పోయిన రైతులు దాదాపు ఏడాదిన్నరగా జీవనోపాధి కోల్పోయారు. ఇటు వ్యవసాయం కోల్పోయి అటు చేయటానికి ఇతర వ్యాపకాలూ లేక నానా అవస్తలు పడుతున్నారు.
ప్రభుత్వం గడచిన రెండున్నరేళ్ళల్లో 35 వేల ఎకరాలను సేకరించగలిగినా ఇంకా సేకరించాల్సింది ఉంది. ఉద్దండరాయపాలెం, నవులూరు, పెనుమాక, తాడేపల్లి, ఉండవల్లి, లింగయపాలెం గ్రామాల్లోని పలువురు రైతులు తమ భూములను ఇవ్వమంటూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. ఆ భూముల కోసం ప్రభుత్వం శత విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడే ప్రతిపక్షం రంగం ప్రవేశం చేసింది. ఎందుకంటే, పై గ్రామాల్లోని రైతుల్లో అత్యధికులు రెడ్డి, కాపు సామాజికవర్గాలకు చెందిన వారు కావటం గమనార్హం.
అదే సమయంలో సమీకరణలో భూములను కోల్పోయిన రైతులకేమన్నా ప్రభుత్వం అండగా ఉందా అంటే అదీ లేదు. పైగా రాజధాని నిర్మాణం పేరుతో అధికార పార్టీ నేతలే భారీ ఎత్తున లబ్దిపొందారన్న ప్రచారం జరుగుతోంది. దాంతో భూములు కోల్పోయిన రైతులు మండిపడుతున్నారు. అందుకనే తమ భూములను తమకు తిరిగి ఇచ్చేయమంటూ ఆందోళన మొదలుపెట్టారు. ఈ పరిస్ధితుల్లో పై గ్రామాల రైతులు ప్రభుత్వానికి తమ భూములను ఎందుకు ఇస్తారు?
దానికితోడు క్షేత్రస్ధాయి పరిస్ధితులను చూస్తుంటే, రాజధాని నిర్మాణం కూడా ఇప్పటికిప్పుడు సాధ్యం అయ్యేట్లు కనబడటం లేదు. ఇంతవరకూ మాస్టర్ ప్లానే సిద్ధం కాలేదు. పైగా రాజధాని కోసం ఎంపిక చేసిన ప్రాంతంపై గ్రీన్ ట్రైబ్యునల్లో, సుప్రింకోర్టులో కేసులు. దాంతో రాజధాని నిర్మాణమన్నది ఓ బ్రహ్మపదార్ధంలాగ తయారైంది.
మాస్టర్ ప్లానే ఇంత వరకూ సిద్ధం కాకపోతే ఇక మాస్టర్ డెవలపర్ ఎంపిక ఎప్పటికి మొదలవుతుంది? రాజధాని నిర్మాణ వ్యవహారం ఇంత సంక్లిష్టం అవ్వటానికి చంద్రబాబే కారణం. రాజధాని వ్యవహారం చూస్తున్న ఎవరికైనా రాజధాని నిర్మాణం ముసుగులో చంద్రబాబు భారీ లబ్ది పొందుతున్నారనే ప్రచారం జరుగుతోందంటే అందుకు చంద్రబాబు వ్యవహారశైలే కారణం.
రాజధాని నిర్మాణం విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లోపించటాన్ని ప్రతిపక్ష నేత జగన్ అవకాశంగా తీసుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ తరపున ఆందోళనలు నిర్వహించారు. మళ్ళీ ఈ నెల 19న పై గ్రామాల్లో రోడ్డు షో నిర్వహిస్తున్నారు. దాంతో అధికార టిడిపిలో టెన్షన్ ఖాయం. ఇటు రాజధాని నిర్మాణం మొదలవ్వక, అటు జీవనోపాధీ కోల్పోయిన వేలాదిమంది రైతులు, రైతు కూలీలు రోడ్డున పడ్డది మాత్రం వాస్తవం.