మధ్యంతరం దిశగా తమిళనాడు

Published : Jan 17, 2017, 01:00 AM ISTUpdated : Mar 24, 2018, 12:06 PM IST
మధ్యంతరం దిశగా తమిళనాడు

సారాంశం

జయ మృతితో ఏర్పడిన సానుభూతి పవనాలతో ఈజీగా ఎన్నికల్లో గట్టెక్కి అప్పుడు నేరుగా సిఎం కుర్చీలో కూర్చోవచ్చని మద్దతుదారులు శశికళకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

తమిళనాడు రాజకీయాలు మధ్యంతర ఎన్నికల దిశగా నడుస్తున్నాయా? జయలలిత మరణించిన నాటినుండి జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అవుననే అనిపిస్తోంది. అధికార ఏఐఏడిఎంకెలో  తిరుగులేని నేతగా ఉన్న ‘అమ్మ’ మరణంతో పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఇప్పటికైతే పన్నీర్ శెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడు దింపేస్తారో తెలీదు. ఎందుకంటే, పన్నీర్ ను సిఎంగా ఎవరూ గుర్తించటం లేదు.

 

పరిస్ధితులను గమనించిన పన్నీర్ కూడా తాను సిఎంనని అనుకుంటున్నట్లు లేరు. సాంకేతికంగా సిఎమ్మే అయినప్పటికీ సచివాలయంలోని తన మంత్రి కార్యాలయం నుండే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతకీ పన్నీర్ కు అంత ఇబ్బంది ఎందుకు వచ్చిందంటే శశికళ వల్లే. పన్నీర్ స్ధానంలో ఎప్పుడెప్పుడు సిఎం అవుదామా అని ఆత్రంగా ఎదురుచూస్తున్న శశికళే తమిళనాడుకు అనధికార ముఖ్యమంత్రి. మంత్రివర్గ సహచరులు గానీ, ఉన్నతాధికారులు గానీ ఆఖరకు ప్రజలు కూడా పన్నీర్ ను సిఎంగా గుర్తిస్తున్నట్లు కనబడటం లేదు.

 

అయితే, పరిస్ధితులు గమనిస్తున్న డిఎంకె, ఒకవేళ శశికళ గనుక సిఎం అయితే ఏఐఏడిఎంకెలో చీలక తప్పదని అంచనా వేస్తోంది. దాంతో చీలికవర్గాన్ని తమతో కలుపుకోవటం ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం లేకపోలేదని రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. దానికితోడు తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిందని, కాబట్టి దాన్ని భర్తీ చేసేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన అభిమాన సంఘాలు తీర్మానాలు చేస్తూ హడావుడి మొదలుపెట్టాయి. దాంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది.

 

ప్రస్తుత రాజకీయాలను గమనిస్తే పన్నీర్ కూడా ఎంతో కాలం సిఎంగా కొనసాగలేరన్న విషయం అర్ధమవుతోంది. అలాగే, జయస్ధానాన్ని శశికళ భర్తీ చేయటాన్ని పార్టీలోని మెజారిటీ జిల్లాల కార్యవర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. పైగా మెజారిటీ జిల్లాల కార్యవర్గాలు జయ మేనకోడలు దీపా జయకుమార్నే జయకు వారసురాలిగా తీర్మానాలు చేసాయి. దానికితోడు ఆర్కె నగర్ లో శశికళ పోటీ చేయకూడదంటూ ప్రజలు, కార్యవర్గాలు తీర్మానం చేయటం గమనార్హం.

 

ఈ నేపధ్యంలో ఆర్కెనగర్ లో శశికళ పోటీ చేయటం అనుమానమే. ఎందుకంటే, అక్కడ దీపా పోటీ చేయబోతున్నది. ఒకవైపు దీప, మరోవైపు శశికళ, ఇంకోవైపు డిఎంకె తదితర పార్టీలు పోటీ చేస్తే శశికళ గెలిచేది అనుమానమే. ఒకవేళ ఆర్కె నగర్ లో దీప గెలిస్తే ఆమే జయ వారసురాలిగా ప్రచారం మొదలవుతుంది. దాంతో శశికళ ఇరుకున పడుతుంది. ఇటువంటి పరిస్ధితిల్లో మధ్యంతర ఎన్నికలకు వెళితే ఎలాగుంటుందని పలువురు శశికళ మద్దతుదారులు యోచిస్తున్నారని సమాచారం. ఇప్పటకిప్పుడు ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మధ్యంతరానికి వెళితే శశికళ ఎక్కడి నుండైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది. జయ మృతితో ఏర్పడిన సానుభూతి పవనాలతో ఈజీగా ఎన్నికల్లో గట్టెక్కి అప్పుడు నేరుగా సిఎం కుర్చీలో కూర్చోవచ్చని మద్దతుదారులు శశికళకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

 

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?