
సినీ నటుడు మోహన్ బాబు మళ్లీ సైకిల్ ఎక్కనున్నారా.. అంటే అవుననే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎన్టీయార్ ఉన్న సమయంలో పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఈ డైలాగ్ కింగ్ ఆ తర్వాత చంద్రబాబుతో మాత్రం దూరంగానే ఉంటూ వచ్చారు.
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన పాలనపై ప్రశంసలు కురిపించారు ... కానీ కాంగ్రెస్ పార్టీకి వెళ్లే యోచన మాత్రం చేయలేదు. వైఎస్ పార్టీలోకి ఆహ్వానించినా సున్నితంగా తిరస్కరించారు.
గత కొంత కాలంగా ప్రత్యక్షరాజకీయాల్లోకి మళ్లీ వస్తానని మోహన్ బాబు అంటూ వస్తున్నారు కానీ, ఏ పార్టీలో చేరుతారనేది మాత్రం చెప్పలేదు.
2014 ఎన్నికల వేళ మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలసి మోదీని కలిశారు. దీంతో ఆయన బీజేపీ లో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ, అదేమీ జరగలేదు.
ఇప్పుడు టీడీపీలో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతి రోజున చంద్రబాబు సొంత ఊరు నారావారి పల్లెకి వెళ్ళిన మోహన్ బాబు అక్కడ బాబుతో గంటకు పైగా చర్చించడటమే ఇందుకు కారణం.
దీంతో మోహన్ బాబు తన సన్నిహితులతో కలసి త్వరలో టీడీపీ తీర్ధం పుచ్చుకొనున్నారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఫిబ్రవరి 12న విజయవాడలో నిర్వహించే బహిరంగ సభలో మోహన్ బాబు టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.