
సొంత జిల్లాలోనే జనసేనకు దిక్కులేదు. ఏడేళ్ళ తర్వాత జిల్లాలో జరుగుతున్న ఓ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ గురించి ఆలోచించకపోవటం ఆశ్చర్యంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు ఉన్న ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసిందే. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ది కూడా ఇదే జల్లాలోని మొగల్తూరు. పవన్ రాజకీయ పార్టీ పెట్టి ఇప్పటికి మూడేళ్ళైంది. పార్టీ పెట్టక ముందే అంటే పోయిన ఎన్నికల్లోనే టిడిపి-బిజెపితో కలిసి పనిచేసిన విషయం కూడా తెలిసిందే.
తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో పవన్-భాజపాల మధ్య దూరం పెరిగింది. ఒకసారి టిడిపి నేతలను విమర్శిస్తూ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తూ మొత్తానికి చంద్రబాబుకు దగ్గర అని అనిపించుకున్నారు. అటువంటి సమయంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని భారీ ప్రకటన చేసారు. కానీ తర్వాత మాత్రం తనదైన స్టైల్లోనే అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. ఒకవైపు రాజకీయ వేడి పెరిగిపోతున్నా, రాజకీయ సమీకరణలు మారిపోతున్నా పవన్ మాత్రం ఏ విషయంలోనూ స్పందించటం లేదు.
సరే, ‘జనసేన స్టామినా ఇది’ అని తెలిసేట్లు రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఎన్నిక కూడా రాలేదనుకోండి. అయితే, హటాత్తుగా నంద్యాల ఉపఎన్నిక ముంచుకొచ్చింది. దాంతో అందరూ పవన్ ఏం నిర్ణయం తీసుకుంటాడో అని ఎదుకుచూసారు. చివరకు పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా పవన్ మాత్రం ఎప్పటి లాగే మౌనాన్నే ఆశ్రయించారు. నంద్యాల ఉపఎన్నిక వేడి పెరిగిపోతున్న దశలోనే హటాత్తుగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలొచ్చి మీద పడ్డాయి.
ఏడేళ్ల తర్వాత జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికలవ్వటంతో ప్రధాన పార్టీలన్నీ మంచి కాకమీదున్నాయి. చివరకు వామపక్షాలు, కాంగ్రెస్ కూడా రంగంలోకి దూకాయి. అయినా పవన్ పత్తాలేడు. ఒంటరిగా పోటీ చేయాలా? లేదంటే ఏదో ఒకపార్టీతో పొత్తు పెట్టుకోవాలా? అన్నది పూర్తిగా పవన్ ఇష్టమే. నామినేషన్ల కోలాహలం ప్రారంభమై మొన్న 10వ తేదీన ముగిసింది. మిగిలిన రాజకీయ పార్టీలు, జనాలు కూడా జనసేన ఏం చేస్తుందా అని ఉత్కంఠతో ఎదురుచూసాయి. ఎందుకు చూసాయంటే, కాకినాడ పవన్ సొంత జిల్లాలో ఉంది కాబట్టే. ఇక్కడైనా పోటీ విషయమై ఏదో ప్రకటన చేయకపోతారా అనుకున్నారు. తీరు చూస్తే కాకినాడలో కూడా పత్తాలేడు. దాంతో సొంతజిల్లాలోనే జనసేనకు దిక్కులేదని ఇపుడు జనాలు అనుకుంటున్నారు.