
తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అవినీతిని అంతం చేయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నంద్యాల ఉప ఎన్నిక ఫలితంలో టీడీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలవుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జగన్ నాల్గవరోజు శనివారం గోస్పాడు మండలంలో పర్యటించారు.
టీడీపీ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తానని మోసగించారని ఆరోపించారు జగన్. డ్వాక్రా మహిళలకు అన్యాయం చేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ ఉద్యోగమన్నారు...ఉద్యోగం లేదంటే నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. వీటిలో ఒక్కటైనా అమలు చేశారా... అని జగన్ ప్రశ్నించారు. చెప్పిన అబద్ధాలే చెప్పి బాబు సీఎం పీఠం చేజిక్కించుకున్నారని మండి పడ్డారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల్లో మళ్లీ అలాంటి అబద్ధాలతో ప్రచారం ప్రారంభించారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు మాటు నమ్మి మరోమారు మోసపోవద్దని జగన్ ప్రజలకు సూచించారు.
ముఖ్యమంత్రిగా మూడున్నరేళ్ల క్రితం కర్నూల్ జిల్లాలో 2014 ఆగష్టు 15వ తేదిన జేండా ఎగరవేసిన చంద్రబాబు. ఈ జిల్లాకు అనేక హామీలు ఇచ్చారని, అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా చేశారా... అని ఆయన ప్రశ్నించారు. ఆయన మాటల్లోనే ఎయిర్‌పోర్టు, స్మార్ట్‌సిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, జాతీయ యూనివర్శీటీలు అని జిమ్మికులు చేస్తున్నారు, కానీ అందులో ఏ ఒక్కటైనా చేశారా అని ఆయన ఎద్దేవా చేశారు. రాయలసీమకు వైఎస్ హయాంలో కేసీ కెనాల్ పరిధిలో రెండు పంటలకు నీరు వచ్చేదని, ఈ మూడేళ్లుగా ఒక్క పంటకు కూడా నీరు అందని పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. బాబు ప్రభుత్వం పోవాలంటే నంద్యాల ఉప ఎన్నిక మొదటి అడుగు కావాలని ఆయన సూచించారు. అందుకు వైసీపి అభ్యర్ధికి ఓటు వేసి గెలిపించాలన్నారు.