మంజూనాధ కమీషన్ సభ్యులపై ‘దొంగతనం’ కేసా ?

First Published Dec 10, 2017, 11:09 AM IST
Highlights
  • హడావుడిగా తీర్మానం చేసిన ‘కాపులకు రిజర్వేషన్’ తీర్మానం చంద్రబాబునాయుడు మెడకే చుట్టుకోబోతోందా?

హడావుడిగా తీర్మానం చేసిన ‘కాపులకు రిజర్వేషన్’ తీర్మానం చంద్రబాబునాయుడు మెడకే చుట్టుకోబోతోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బిసిల్లో చేర్చటానికి వీలుగా కాపులకు 5 శాతం రిజర్వేషన్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయిచిన సంగతి అందరికీ తెలిసిందే. అదే ఇపుడు చిలిచి చిలికి గాల వాన లాగ తయారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు హడావుడే దీనికి కారణంగా తెలుస్తోంది.

ఇంతకీ జరింగిందేమిటంటే, కాపులను బిసిల్లోకి చేర్చాలన్న తన హామీ కోసం చంద్రబాబు జస్టిస్ మంజూనాధ కమీషన్ నియమించారు. కమీషన్ కూడా కసరత్తు చేసి నివేదిక తయారుచేసింది. అయితే, పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎదురైన ఆటంకాలను అధిగమించేందుకు, జనాల దృష్టిని మళ్ళించేందుకు చంద్రబాబు హడావుడిగా కమీషన్  నివేదికను మంత్రివర్గంలో పెట్టి కాపులకు 5 శాతం తీర్మానాన్ని ఆమోదింపచేసుకున్నారు. వెంటనే మరుసటి రోజే అసెంబ్లీలో కూడా నివేదికతో పాటు తీర్మానాన్ని ప్రవేశపెట్టించి అసెంబ్లీ ఆమోదం తీసేసుకున్నారు. ఇక్కడ సమస్య మొదలైంది.

కమీషన్ తయారుచేసిన నివేదిక ఇంకా తన వద్ద ఉండగానే మంత్రివర్గం ఆమోదించటమేంటి? అసెంబ్లీతీర్మానం అయిపోవటమేంటంటూ ఛైర్మన్ మంజూనాధ విస్తుపోయారు. మరి, జరిగిందేంటి? అంటే, తయారైన నివేదిక ఛైర్మన్ తో పాటు కొద్దిపాటి మార్పులతో మిగిలిన ముగ్గురుసభ్యుల వద్దా కాపీలున్నాయి. ఛైర్మన్-సిఎం మధ్య అభిప్రాయభేదాలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఛైర్మన్ కు సంబంధం లేకుండానే సభ్యలతో ప్రభుత్వంలోని ముఖ్యులు మాట్లాడేసుకుని నివేదికను తెప్పించేసుకున్నారు. దాంతో ఛైర్మన్ కు సంబంధం లేకుండానే సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి నివేదికను అందించేసారు. ఆ నివేదికనే మంత్రివర్గం తర్వాత అసెంబ్లీ ఆమోదించేసింది.

ఇక్కడే ఛైర్మన్ కు మండింది. తన పేరుతో ఏర్పాటుచేసిన కమీషన్లో తన నివేదికకే దిక్కులేదా అంటూ సిఎం వైఖరిపైనే మండిపడుతున్నారట. సభ్యులు ఇచ్చిన నివేదిక చెల్లదని ఛైర్మన్ అంటున్నారు. తానిచ్చే నివేదికే అధికారిక నివేదికగా మంజూనాధ చెబుతున్నారు. పైగా తాను ఊరిలో లేని సమయంలో సభ్యులు సిఎంను కలిసి నివేదిక ఇవ్వటంపై మండిపడుతూ ‘సభ్యులపై దొంగతనం’ కేసు పెట్టే యోచనలో ఛైర్మన్ ఉన్నట్లు ప్రచారం మొదలైంది. ఒక వేళ అదే నిజమైతే మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవేమో?

click me!