వాహనదారులకు శుభవార్తే...

First Published Dec 9, 2017, 6:31 PM IST
Highlights
  • మధ్య, సామాన్య తరగతి జనాల గురించి కూడా నరేంద్రమోడి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది.

మధ్య, సామాన్య తరగతి జనాల గురించి కూడా నరేంద్రమోడి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది. నిత్యావసారలతో పాటు చాలా కీలకమైపోయిన పెట్రోలు ధరలను తగ్గించేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. పాపం పెరిగినట్లు రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్‌ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెట్రోల్, డీజల్ ధరలను అదుపులో ఉంచేందుకు వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొత్త విధానాన్ని తీసుకురానుంది.

అదేంటంటే, పెట్రోలులో మిథనాల్ ను కలపాలని నిర్ణయించింది. దీని వల్ల ఇంధనం ధరతో పాటు కాలుష్యాన్ని నియంత్రణలో ఉంచేందుకు మిథనాల్ ఉపయోగపడుతుందట. లీటర్ పెట్రోలులో 15 శాతం మిథనాల్‌ను కలపనున్నట్లు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ విధానానంపై  ప్రకటించనున్నట్టు ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన చెప్పారు. బొగ్గు ద్వారా మిథనాల్‌ను ఉత్పత్తి చేస్తారని, ఇందుకు లీటరుకు రూ.22 ఖర్చవుతుందని గడ్కరీ తెలిపారు.

ప్రస్తుతం రూ.80గా ఉన్న పెట్రోల్‌ ధరను తగ్గించేందుకు ఈ విధానం దోహదం చేస్తుందన్నారు. ఇదే మిథనాల్‌ను చైనా రూ.17కే ఉత్పత్తి చేస్తోందన్నారు. మిథనాల్‌ను పెట్రోల్‌లో కలపడం ద్వారా ధర తగ్గించడంతో పాటు, కాలుష్యం కూడా తగ్గుముఖం పడుతుందని తెలిపారు. మిథనాల్‌తో నడిచే ప్రత్యేక ఇంజిన్‌ను ప్రముఖ కంపెనీ వోల్వో తీసుకొచ్చిందని, అదే ఇంధనంతో నడిచే 25 బస్సులను త్వరలో నడపనున్నట్లు గడ్కరీ తెలిపారు.

అలాగే మిథనాల్ తో పాటు ఇథనాల్‌ వినియోగం కూడా పెరగాల్సి ఉందన్నారు. పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి చమురు శుద్ధికర్మాగారాలు నెలకొల్పే బదులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తన మంత్రివర్గ సహచరులకు సూచించినట్లు తెలిపారు. మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌పై గడ్కరీ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం రోజుకు 28 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మిస్తున్నామని, దాన్ని 40 కిలోమీటర్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

 

click me!