
మనుషుల్లో కొందరుంటారు. తమే గొప్పఅని, ఎదుటివాళ్లు ఒట్టి వెధవలనే అభిప్రాయంతో ఉంటారు. సమయం, సందర్భం లేకుండా ఎదుటివాళ్లపై నోరు పారేసుకుంటూ పిలిచి మరీ గోక్కుంటుంటారు. ఉపోద్ఘాతమంతా ఎవరి గురించో అర్ధమైపోయిందా? అదేనండి జెసి దివాకర్ రెడ్డి అని ఓ ఎంపి ఉన్నారులేండి. ఆయన గురించే. దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉండి సమాజాన్ని ఉద్ధరించేసిన ఆయనగారు ప్రస్తుతం టిడిపిలో చేరి అనంతరపురం పార్లమెంట్ సభ్యునిగా ప్రజసేవలో తరించేస్తున్నారు.
కొద్ది రోజులుగా వేదికేదైనా సరే జెసి పూనకం వచ్చినట్లుగా ఇటు రెడ్లను, అటు జగన్ను నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. జగన్ గురించి మాట్లాడుతూ, ‘జగన్ అసలు రెడ్డే కాద’న్నారు. ‘రెడ్డి సామాజికవర్గాన్ని రెచ్చ గొట్టటం ద్వరా జగన్ లాభపడాలని చూస్తున్నారని’ ఆరోపించారు. జగన్ నిఖార్సైన రెడ్డి కాదని, క్రిస్తియన్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. పనిలో పనిగా పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా రెడ్డి కాదన్నారు. ఆయన పూర్తిపేరు రఘువీరా రెడ్డి యాదవ్ అని అదేదో తానే కొత్తగా కన్నుకున్నట్లు చెప్పారు.
ఇక, పవన్ గురించి మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు అధికారంలోకి వచ్చేంత సీన్ లేదన్నారు. నటుడిగా మాత్రమే పవన్ కు క్రేజ్ ఉందని కూడా అభిప్రాయపడ్డారు. నటులను చూసి ఓట్లేసే పరిస్ధితి ఇపుడు లేదన్నారు. పవన్ను కించపరచటం ద్వారా తన నోటీ దురదను జెసి తీర్చుకోవచ్చేమో గానీ టిడిపికి చేటు తెస్తున్న విషయాన్ని జెసి మరచిపోతున్నట్లున్నారు. చంద్రబాబు కూడా జగన్, కాంగ్రెస్, పవన్ను తిట్టించటానికి జెసిని బాగానే వాడుకుంటున్నట్లు కనబడుతోంది.కానీ ఇదే జెసితో ముందుముదు చంద్రబాబుకే తలనొప్పులు తప్పవనినిపిస్తోంది.
ఎందుకంటే, చంద్రబాబు ఎక్కడ సభ నిర్వహించినా జెసి అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. వేదికపైకి ఎక్కటం, జగన్, రెడ్లను తిట్టటం మళ్ళీ రెడ్లందరూ చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని పిలుపినివ్వటం వివాదాస్పదమవుతోంది. ఒకవైపు రెడ్లను తిడుతూనే, మరోవైపు చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలంటూ చెప్పటంలో ఆంతర్యం జెసికే తెలియాలి. సందర్భమేదైనా సరే కొద్ది రోజుల నుండి పదే పదే కులాల ప్రస్తావన లేకుండా జెసి మాట్లాడటం లేదు. జెసి రాజకీయం ఏమిటో తెలీదు కానీ జెసి మాటలు వింటున్నవారికి చిరాకు తెప్పిస్తోంది.