అమరావతికి స్టార్ హోటళ్లొస్తున్నాయోచ్

First Published Feb 2, 2017, 10:50 AM IST
Highlights

అతి తక్కువ వ్యయంతో అత్యుత్తమంగా అమరావతి నిర్మించాలనే ఇంతలా శ్రమిస్తున్నా: చంద్రబాబు నాయుడు

అమరావతి రెడీ అవుతూ ఉంది...

 

ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా, ముహూర్తాలు వాస్తు చూసుకుని పూజలు చేసినా  అమరావతి కదల్లేదని అనుకుంటున్నారా... తప్పు. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరల్డ్ క్లాస్  అమరావతి నిర్మాణాన్ని సమీక్షించారు. 2018 నాటికి పూర్తి చేయాలనుకుంటున్న ప్రాజక్టులలో భాగంగా ఆయన అమరావతిని కూడా సమీక్షించారు. ఈ మేరకు అమరావతి  2018 నాటికి పూర్తి అవుతుందనే అనుకోవాలి.

అంతా అనుకుంటున్నట్లు రాజధాని మీద ప్రజల సొమ్మంతా తగలేయడం లేదు.

 

“రాజధాని, పరిపాలన నగరం నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీపడదలుచుకోలేదు. అయినా అతి తక్కువ వ్యయంతో అత్యుత్తమంగా అమరావతి నిర్మించాలనే ఇంతలా శ్రమిస్తున్నా,” ‘సమావేశానికి హాజరయిన అధికారులకు  ముఖ్యమంత్రి సెలవిచ్చారు.

 

త్వరలో అమరావతిలో విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృత విశ్వవిద్యాలయాలొస్తున్నట్లు చెబుతూ గ్రీన్ ఫీల్డ్ నగరాలైన నయా రాయపూర్, పుత్రజయ, ఆస్తానాలకు ధీటుగా అమరావతి నగర నిర్మాణం సాగుతుందని ఆయన అన్నారు.

 

అమరావతికి ఏమేమి అంతర్జాతీయ హంగులు సమకూరుతున్నాయ్ కూడా ఆయన వివరించారు. అయన అందించిన సమాచారం ఇది :

 

*అమరావతిలో ఆరు జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలు

 

*సుమారు రూ. 250 కోట్లతో ఒక ఫైవ్ స్టార్, ఒక ఫోర్ స్టార్, నాలుగు త్రీ స్టార్ హోటళ్ల ఏర్పాటు

 

*అమరావతిలో దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం

 

*2018 నాటికి స్టేడియం-ఎరీనా నిర్మాణం, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ స్కూల్ ఏర్పాటుకు ముందుకొచ్చిన అంతర్జాతీయ సంస్థ

 

*శిల్పారామం, లైబ్రరీ, మ్యూజియం నిర్మాణానికి కొనసాగుతున్న ప్రక్రియ

 

పరిపాలనా నగరంలో నిర్మించే ప్రభుత్వ భవనాల డిజైన్లు వినూత్నంగా వుండాలని ఆయన సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో అన్ని నగరాలకన్నా ఉత్తమంగా వుండేలా డిజైన్లు రూపొందించాలని ఆయన నొక్కిచెప్పారు.

 

 అక్కడి నుంచే ఆయన రాజధాని భవనాల నిర్మాణ సముదాయ ప్రధాన ఆర్కిటెక్ట్ నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.

 

భారతీయ-ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ప్రతిబింబించేలా నగర నిర్మాణం వుండాలి. ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా నూతనంగా డిజైన్లు రూపొందించాలని ఆయన నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులకు ఆయన సూచనలిచ్చారు. మరే ఇతర నగరం అమరావతికి సాటి రాకుండా వినూత్నంగా ఆలోచిస్తారన్న నమ్మకం వుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

click me!