ఉండవల్లి శ్రీదేవికి మరో షాక్.. ప్రచార రథం లాక్కుపోయిన మహిళ, నాదేనంటూ ఆధారాలు

By Siva KodatiFirst Published Mar 27, 2023, 5:17 PM IST
Highlights

వైసీపీ బహిషృత నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి మరో షాక్ తగిలింది. గుంటూరులోని ఆమె కార్యాలయం వద్ద వున్న వైసీపీ ప్రచార రథాన్ని ఓ మహిళ తీసుకుపోయింది. 

వైసీపీ బహిషృత నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి చెందిన కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. పార్టీ ప్రచార రథం తమదేనంటూ ఒక మహిళ హల్ చల్ చేశారు. పార్టీ అవసరాల కోసం తానే దానిని కొన్నానని.. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యే దగ్గర తమ కారు వుండటానికి వీల్లేదంటూ గ్రేసి లిడియా అనే మహిళ మండిపడింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. డాక్యుమెంట్లు చూపించి కారు తీసుకెళ్లాలని సూచించారు. 

కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన షాక్‌కి గింగిరాలు తిరుగుతున్న వైసీపీకి .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు శరాఘాతంలా తగిలాయి. సభలో బలం వుండటంతో పాటు విపక్ష పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల మద్ధతుతు ఏడు స్థానాలు తన ఖాతాలో పడతాయని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహంతో షాకిచ్చారు. దీనికి తోడు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై చర్చ జరగుతోంది. 

Also REad: రిటర్న్ గిఫ్ట్‌ ఇస్తా: క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై వైసీపీపై ఉండవల్లి శ్రీదేవి ఫైర్

ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వైసీపీ నుంచి ఈ నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది. 

ఇకపోతే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తాను  క్రాస్ ఓటింగ్  చేసినట్టుగా  ఆరోపణలు  చేసిన  వైసీపీ నేతలకు  రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని  ఎమ్మెల్యే  ఉండవల్లి శ్రీదేవి  చెప్పారు. ఆదివారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మూడు  రోజులుగా  తనపై  సోషల్ మీడియాలో  అసత్య ప్రచారం చేస్తున్నారన్నారని కొన్ని మీడియా చానెల్స్,  కొందరు వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆమె  ఆరోపించారు.  తాను ఎలాంటి అక్రమాలకు  పాల్పడలేదని శ్రీదేవి  స్పష్టం  చేశారు.  అమరావతి ప్రాంతంలో  ఉన్న తనను రాజకీయంగా వైసీపీ నేతలు  టార్గెట్  చేశారని  ఆమె  ఆరోపించారు.  డబ్బులు  ఇచ్చి తనపై, కార్యాలయంపై  దాడులు  చేయించారన్నారు.   తాను  ఎమ్మెల్యేగా  విజయం సాధించిన రోజు నుండి తనను వేధిస్తున్నారన్నారని శ్రీదేవి ఆరోపించారు.

Also Read: పార్టీ నుంచి సస్పెన్షన్ .. ఉండవల్లి శ్రీదేవి ఆఫీసును ముట్టడించిన వైసీపీ శ్రేణులు, ఫ్లెక్సీల చించివేత

ఎమ్మెల్సీ  ఎన్నికల్లో  తాను  ఎవరికి ఓటు  చేసిందో  వైసీపీ నాయకత్వానికి  తెలుసునని  ఉండవల్లి శ్రీదేవి  చెప్పారు. 22వ ప్యానెల్ లో  జనసేన ఎమ్మెల్యే లేరా, విశాఖ జిల్లాకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యే  లేరా  అని ఉండవల్లి శ్రీదేవి  ప్రశ్నించారు.  ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుండే తనపై కుట్రలు  చేస్తున్నారని ఆమె  ఆరోపించారు.   తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నట్టుగా  నిరూపిస్తారా అని శ్రీదేవి సవాల్  విసిరారు. ఈ విషయమై అమరావతి మట్టిపై ప్రమాణం చేద్దామా అని  ఆమె  వైసీపీ నేతలను కోరారు. తనను గెలిపించిన ప్రజల కోసం ఇక నుండి పోరాటం  చేస్తానన్నారు. తాను ఒక డాక్టర్ అని, తన భర్త కూడా డాక్టర్ అని ,తమకు రెండు ఆసుపత్రులు కూడా  ఉన్నాయన్నారు. తాను డబ్బులు తీసుకొని ఓటు వేయాల్సిన అవసరం లేదని  ఎమ్మెల్యే శ్రీదేవి  చెప్పారు. తనకు  ఏమైనా జరిగితే  ఏపీ ప్రభుత్వ సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డిదే  బాధ్యత  అని శ్రీదేవి వ్యాఖ్యానించారు. 

click me!