ఆంధ్రప్రదేశ్‌లో దంచికొడుతుకున్న వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం.. అలర్ట్‌గా ఉండాలన్న అధికారులు..

Published : Jun 06, 2022, 10:31 AM ISTUpdated : Jun 06, 2022, 10:39 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో దంచికొడుతుకున్న వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం.. అలర్ట్‌గా ఉండాలన్న అధికారులు..

సారాంశం

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, విశాఖ, ఒంగోలు, నెల్లూరు, జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. 

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి చాలా ప్రాంతాల్లో జోరుగా వర్షాలు పడుతున్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, విశాఖ, ఒంగోలు, నెల్లూరు, బాపట్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. విశాఖలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. ఆర్కే బీచ్, ప్రసాద్ గార్డెన్స్ ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలుచోట్ల ఈదురుగాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు  నేలకొరిగాయి. దీంతో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే వర్షాలు పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు కర్నూలు జిల్లా ఆలూరు మండలం కళ్లివంక వాగులో కారు కొట్టుకుపోయింది.ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు పొంగింది. దీనిని గుర్తించని కర్ణాటకకు చెందిన ఒక ఫోర్డ్ వాహనం గుంతకల్లు  నుంచి ఆలూరు వెళ్తూ అర్ధరాత్రి ప్రాంతంలో వాగులోకి దిగి కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్సై రామానుజులు ఘటనా స్థలానికి చేరుకుని కొట్టుకుపోయిన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కారులో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది. వాగు పొంగిపొర్ల‌డంతో గుంత‌క‌ల్లు, ఆలూరు మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి.

Also Read: ఉమ్మడి మ‌హబూబ్‌నగర్‌ జిల్లాలో వాన బీభత్సం.. పిడుగుపాట్లకు ముగ్గురు మృతి

మరోవైపు ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు - గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. 

మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూర్యాపేటలోనూ భారీ వర్షం కురుస్తోంది. ఈదురుగాలులకు విద్యుత్​ స్తంభాలు పడిపోయాయి. పలు ఇండ్లమీద నుంచి రేకులు కొట్టుకుపోయాయి. బూర్గంపాడు ఏరియాలోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రోడ్లమీ పలు చోట్ల భారీ వృక్షాలు పడిపోయాయి.  ఆదివారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వ‌ర్షం బీభత్సం సృష్టించింది.  పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. 

రెండు రోజుల్లో ఏపీలో విస్తరించనున్న రుతుపవనాలు..
ఈ ఏడాది సాధారణం కంటే మూడు రోజుల ముందుగానే కేరళలోని ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు.. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడు వరకు విస్తరించాయి. మరో రెండు రోజుల్లో ఏపీలో కూడా విస్తరించే అవకాశం ఉంది. రేపు తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నెల 10వ తేదీలోపు రుతుపవనాలు పూర్తిగా విస్తరించే అవకాశం ఉంది. 

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwara Darshanam: తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ | Asianet News Telugu