
కర్నూలు : నీటి ఉధృతికి కళ్లివంక వాగులో కారు కొట్టుకుపోయిన ఘటన కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెళగల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు… ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు పొంగింది. దీనిని గుర్తించని కర్ణాటకకు చెందిన ఒక ఫోర్డ్ వాహనం గుంతకల్లు నుంచి ఆలూరు వెళ్తూ అర్ధరాత్రి ప్రాంతంలో వాగులోకి దిగి కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న ఆలూరు సీఐ ఈశ్వరయ్య, ఎస్సై రామానుజులు ఘటనా స్థలానికి చేరుకుని కొట్టుకుపోయిన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అందులో ఎంత మంది ఉన్నారనే సమాచారం తెలియడం లేదని ఎస్ఐ తెలిపారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి వైకుంఠ మల్లికార్జున, నాయకులు జహీర్, అమీర్ మరికొందరు వాహనదారులు, ప్రజలు ప్రత్యక్షంగా చూస్తుండగానే కారు నీటిలో కొట్టుకుపోయింది. పోలీసులు అక్కడే ఉండి వాహనం జాడ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
అయితే, కల్లివంక వాగులో కొట్టుకుపోయిన కారులో ఐదుగురు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారు ఎవరిదనేది కూడా తెలియలేదు. ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గతంలో కూడా ఈ వాగులో ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. గతంలో ఓ సారి 17 మంది వాగులో కొట్టుకుపోయారు. కల్లివంక వాగు కర్ణాటక సరిహద్దుకు ప్రవహిస్తుంది.
కాగా, కల్లివంక వరద ప్రవాహం వల్ల ఆలూరు నుంచి గుంతకల్ వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గల్లంతైన వారిని రక్షించేందుకు ఒక వైపు, చీకటి మరో వైపు వర్షం అడ్డంకిగా మారాయి. పోలీసులు అందులో ఎంత మంది ఉన్నారని వివరాలు తెలుసుకోవడం కోసం గుంతకల్లు, ఆలూరు మధ్యలో ఉన్న కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. రాత్రి చీకట్లో గాలించినప్పటికీ కారు ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయానికి ఉధృతి కొద్దిగా తగ్గడంతో రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది చేపట్టిన గాలింపు చర్యల్లో కారు ఆచూకీ లభ్యమైంది. అందులో ఉన్న ఒకరు సురక్షితంగా ఉన్నట్లు గుర్తించారు.
కారులో ఉన్న వ్యక్తిని బెంగళూరుకు చెందిన జాయెద్ అన్సారిగా గుర్తించారు. కారులో ఉన్న జాయెద్ అన్సారి కారు కొట్టుకుపోయే సమయంలోనే బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. గుల్బర్గాలో పీహెచ్డీలో చేరడం కోసం జాయెద్ అన్సారి బెంగళూరు నుంచి బయలుదేరారు. ఆలూరు వద్ద కల్లివంక వాగులో ఆయన ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. కారులో నుంచి బయటపడిన Ansari, ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. రాత్రంతా ఆయన అక్కడ ఒక్కడే బిక్కుబిక్కుమంటూ గడిపాడు.