జగన్ భయంతోనే చంద్రబాబు ఎన్డీఏలో ఉంటున్నారా?

First Published Jan 30, 2018, 9:46 AM IST
Highlights
  • రాష్ట్ర రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన అంశంపై జోరుగా  చర్చ జరుగుతోంది. 

రాష్ట్ర రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన అంశంపై జోరుగా  చర్చ జరుగుతోంది.  చంద్రబాబునాయుడు, జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా జరుగుతున్న చర్చ కాబట్టి సర్వత్రా ఆసక్తి కనబడుతోంది. అందులోనూ రాబోయే ఎన్నికలకు సంబంధించిన అంశం కావటంతో చర్చలకు కొదవేముంది? వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-భాజపాల మైత్రిపై చర్చోపచర్చలు సాగుతున్న విషయం అందరికీ తెలిసిందే.

టిడిపి-భాజపాల మధ్య సంబంధాలు బాగా క్షీణించాయన్నది వాస్తవం. విచిత్రమేమిటంటే, చంద్రబాబు-ప్రధానమంత్రి భేటీ తర్వాత సంబంధాలు మరింత బలహీనమవటం. వారి సమావేశం తర్వాత చంద్రబాబు కనీసం రెండుసార్లన్నా పొత్తులు వద్దనుకుంటే దణ్ణం పెట్టేస్తా అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. అంటే చంద్రబాబు ప్రధానమంత్రి భేటీ పెద్దగా సానుకూలం కాలేదని అర్ధమైపోతోంది. అందుకనే చంద్రబాబు తరచూ పొత్తు విచ్చిన్నం గురించి మాట్లాడుతున్నారు.

నిజానికి ఎన్డీఏలో టిడిపి భాగస్వామే అయినా ఎవరికీ జరగనంత అవమానం   చంద్రబాబుకు జరుగుతోంది. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు-మోడి సంయుక్తంగా ఇచ్చిన హామీలు కానీ, విభజ చట్టంలోని హామీలను కానీ కేంద్రప్రభుత్వం అమలు చేయటం లేదు. ‘ఓటుకునోటు’ తదితరాల వల్ల చంద్రబాబు కూడా కేంద్రాన్ని డిమాండ్ చేసే శక్తి కోల్పోవటం రాష్ట్రానికి నిజంగా శాపంగా మారింది.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే, అన్ని అవమానాలు ఎదుర్కొంటు కూడా చంద్రబాబు ఇంకా ఎన్డీఏలోనే ఎందుకు ఉంటున్నారు? సరిగ్గా ఇక్కడే చంద్రబాబు వీక్ నెస్ బయటపడుతోంది. అందేమిటంటే, తాను గనుక ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేస్తే ఆ స్దానాన్ని భాజపా వైసిపితో ఎక్కడ భర్తీ చేస్తుందో అన్న ఆందోళన చంద్రబాబులో ఉందట.

అసలే, మూడున్నరేళ్ళ పాలనపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది. దానిమీద రాజకీయంగా చంద్రబాబు బలహీనమైపోయారు. దానిపై ఓటుకునోటు కేసొకటి మెడపై కత్తిలాగ వేలాడుతోంది. దాంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని ఆరోపణల వెల్లువ. ఇన్ని సమస్యల మధ్య తాను గనుక ఎన్డీఏని వదిలేస్తే తన భవిష్యత్తేంటో చంద్రబాబు కళ్ళకు కనబడుతోందట. అందుకనే ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం జగన్ భయంతో అయినా చంద్రబాబు ఇంకొంత కాలం ఎన్డీఏలోనే కొనసాగక తప్పదేమో?

click me!