సుప్రీంకోర్టులో రైతులు విజయం సాధించినా.. అమరావతికి జగన్ ఏం చేయడు : డీఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 22, 2023, 7:41 PM IST
Highlights

అమరావతికి సంబంధించి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టులో రైతులు విజయం సాధించినా.. అమరావతికి జగన్ ఏం చేయడని ఆయన జోస్యం చెప్పారు. 
 

ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కడప జిల్లా ఖాజీపేటలో అమరావతి రైతులు రవీంద్రా రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రాజధానికి మద్ధతుగా వుండాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కోణం నుంచి అమరావతి రాజధాని కాకపోయినప్పటికీ, ప్రజలు మాత్రం రాజధానిగా అమరావతినే భావిస్తున్నారని అన్నారు. అమరావతిపై సుప్రీంకోర్టుకెక్కిన ప్రభుత్వానికి అక్కడ కూడా విజయం దక్కదని ఆయన జోస్యం చెప్పారు. అయితే రైతులు ఈ విషయంలో విజయం సాధించినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం అమరావతికి ఏం చేయదన్నారు. మంత్రులు రాజధాని గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని డీఎల్ రవీంద్రా రెడ్డి దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు. 

ఇకపోతే .. గత నెలలోనూ డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.  వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పేనన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడుతారని డీఎల్ జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఏపీని కాపాడాలని ఆయన ఆకాంక్షించారు. పవన్ కల్యాణ్‌కు నిజాయితీ వున్నా పాలనలో అనుభవం లేదని డీఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. సీఎం అయిన నాటి నుంచే జగన్ అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన ఆరోపించారు. 

ALso Read: వైసీపీకి సింగిల్ డిజిట్ కష్టమే.. పవన్‌కు అనుభవం లేదు, చంద్రబాబు అయితేనే : డీఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు

వైసీపీలో వున్నందుకు అసహ్యంగా వుందన్నారు. తాను ఇంకా వైసీపీలోనే వున్నానని.. వారేమీ తనను తప్పించలేదని డీఎల్ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచే తాను పోటీ చేస్తానని రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ వివేకా కేసులో సుప్రీం తీర్పు తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో ఒంటరిగా పోరాడుతున్న సునీత ధైర్యాన్ని డీఎల్ రవీంద్రా రెడ్డి ప్రశంసించారు. 

click me!