హైదరాబాద్‌లో ఏపీ కాపు నేతల సమావేశం.. హాజరైన తోట చంద్రశేఖర్, గంటా, కన్నా

By Siva KodatiFirst Published Jan 22, 2023, 5:56 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ప్రస్తుతం కాపుల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లో ఏపీ కాపు నేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ తదితర కాపు ప్రముఖులు హాజరయ్యారు.


వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ప్రధానంగా కాపుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈరోజు ఏపీ కాపు నేతల సమావేశం జరిగింది. ఈ భేటీకి బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ తదితర కాపు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించి కేసీఆర్ విధానాలను తోట చంద్రశేఖర్ వివరించారు. అలాగే వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేనల్లోని కాపు నేతల గురించి వీరంతా చర్చించినట్లుగా తెలుస్తోంది. 

ఇదిలావుండగా.. శనివారం కాపు సంక్షేమ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించాలంటూ పొత్తులు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా వుండేందుకు పొత్తులు అత్యవసరమని ఆయన అన్నారు. వైసీపీని ఓడించే సత్తా టీడీపీ- జనసేనకే వుందని ఆయన అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిగా వుండాలనేది కాపు సంక్షేమ సేన ప్రధాన డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభాలో 22 శాతం వున్న కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలని, అంటే సీఎం పదవేనని హరిరామ జోగయ్య కుండబద్ధలు కొట్టారు. 

ALso REad: వాళ్లకు రాజ్యాధికారం లేదా, 35 మంది ఎమ్మెల్యేలున్నారు.. కాపులకు మెచ్యూరిటీయే లేదు : మాజీ సీఎస్ రామ్మోహన్ రావు

ఇకపోతే..ఇటీవల కాపు రిజర్వేషన్ల కోసం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో హరిరామ జోగయ్య తలపెట్టిన నిరవధిక నిరాహారదీక్షను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. బలవంతంగా ఆయనను అంబులెన్స్ లోకి ఎక్కించి… ఆస్పత్రికి తీసుకెళ్లారు. తనను అదుపులోకి తీసుకునే ముందు హరిరామ జోగయ్య ఓ వీడియోని విడుదల చేశారు. ‘జనవరి రెండవ తేదీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి దీక్ష ప్రారంభిస్తానని అన్నాను. కానీ, పోలీసులు చేస్తున్న ఈ పనుల కారణంగా ఈ క్షణం నుంచే దీక్షను ప్రారంభిస్తున్నాను. నాకు ఏదైనా జరిగితే పోలీస్ అధికారులు, సీఎం జగన్ లే కారణం’ అని ఆ వీడియోలో ఆయన చెప్పుకొచ్చారు

click me!