చంద్రబాబువన్నీ పగటి కలలే..!

First Published Sep 23, 2017, 1:27 PM IST
Highlights
  • చంద్రబాబుపై ధ్వజమెత్తిన  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
  • చంద్రబాబు, లోకేష్ సదావర్తి భూములను కాజేయాలని  యత్నించారని ఆరోపణ
  • 2019 ఎన్నికల గురించి చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా

 చంద్రబాబు నాయుడుపై సీసీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన సదావర్తి భూములు, 2019 ఎన్నికల గురించి ప్రస్తావించారు.

సదావర్తి భూముల వేలంపాట విషయంలో తలెత్తిన అవకతవకలను  ప్రతిపక్షాలు ఎత్తిచూపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు ఈ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టగా.. తాజాగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దీనిపై స్పందించారు. సదావర్తి  సత్రం భూములను రూ.22కోట్లకే కొట్టాయలని చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ యత్నించారని రామకృష్ణ  ఆరోపించారు.

 

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి చొరవతో ఆ భూములు రూ.60కోట్లకు ధర పలికాయన్నారు. ప్రభుత్వం కనుక  ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సక్రమంగా వేలంపాట నిర్వహించి ఉంటే..రూ.350కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేకూరేదని రామకృష్ణ అభిప్రయపడ్డారు. రానున్న ఎన్నికల్లోనూ తామే అధికారంలోకి వస్తామని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో  టీడీపీ నేతలు డబ్బిలుచ్చి ఓట్లు వేయించుకున్నారని.. అందుకే విజయం సాధించారని గుర్తు చేశారు.

 

వంశధార నిర్వాసితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రామకృష్ణ ఆరోపించారు. నిర్వాసితుల పరామర్శకు వెళ్లిన సీపీఎం పార్టీ నేత  మధును అరెస్ట్‌ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో భూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల మూడ్రోజుల పాట భారీ ధర్నా చేపట్టనున్నట్లు రామకృష్ణ వెల్లడించారు.

click me!