పండగ పూట కూడా పస్తులేనా?

First Published Sep 23, 2017, 12:20 PM IST
Highlights
  • ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి
  • ప్రజలకు తినడానికి తిండి కూడా లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు
  • ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ ని.. డీలర్లు.. రహస్యంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు

దసరా పండగ సీజన్ లో  ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా ఆనందంగా జరుపుకునే పండగపూట కూడా ఏపీలో కొందరు ప్రజలు అవస్థలు పడుతున్నారు. కనీసం ప్రజలకు తినడానికి తిండి కూడా లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు. పండగ వేళ బంపర్ ఆఫర్ లాగా వారికి నెలవారీ దక్కాల్సిన రేషన్ కూడా అందకుండా చేస్తున్నాడు. దీంతో రేషన్ సరుకులు లభించక.. దుకాణాల్లో కొనుక్కోవడానికి స్థోమత లేక  చాలా మంది ప్రజలు పస్తులు పడుకుంటున్నారు. రేషన్ డీలర్లు.. సరుకులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని స్వయంగా కలెక్టర్లే చెప్పడం గమనార్హం.

రాష్ట్రంలో మొత్తం 29,876 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అందులో 4,618షాపుల డీలర్లు పంపిణీని తీవ్రంగా నిర్లక్షం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. దానిని విస్మరించి ప్రవర్తిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజలకు పంపిణీ చేయాల్సిన రేషన్ ని.. డీలర్లు.. రహస్యంగా అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారనే వాదనలు కూడా వినపడుతున్నాయి. జిల్లాల వారీగా చూస్తే.. కడపలో అత్యధికంగా 536, చిత్తూరులో 515, ప్రకాశంలో 508, అనంతపురంలో 469 షాపుల డీలర్లు ప్రజలకు రేషన్ పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. 

నిబంధనల ప్రకారం ప్రతి నెలా1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. కానీ ఏపీలో కొన్ని రేషన్ దుకాణాలు వారం రోజులు మాత్రమే తెరచి ఉంటున్నాయి. ఇదేంటి అని అడిగిన ప్రజలకు కనీసం సమాధానం కూడా రావడంలేదు. ఒకవేళ రేషన్ పంపిణీ చేసినా.. అన్ని సరుకులు ఇవ్వడం లేదట. కేవలం బియ్యం మాత్రమే ప్రజలకు ఇస్తున్నారు.  ఉట్టి బియ్యం మాత్రం తీసుకొని ఏమి చేస్తామని.. చాలా మంది రేషన్ తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదట. తమకు రేషన్ సరిగా అందడం లేదని కొందరు ప్రజలు అధికారులకు మెరపెట్టుకున్నా.. పట్టించుకోకపోవడం గమనార్హం.

 రేషన్ డీలర్లు మాత్రం.. ఈ విషయంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పాతకాలం నాటి పద్ధతులను అవలంభిస్తూ.. ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారట. వారం రోజుల్లోనే ఇస్తామని గడువు విధిస్తున్నారట. గడువుకి ఒక రోజు ఆలస్యంగా వెళ్లినా నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ.. రేషన్ ఇవ్వమని వెళ్లగొడుతున్నారట. దీంతో ప్రజల్లో రేషన్ మీద ఆశలు సన్నగిల్లుతున్నాయి. కొన్ని రేషన్ దుకాణాలకైతే అసలు డీలర్లు కూడా లేరట. మరి ఆ డీలర్ షాప్ కి వచ్చే రేషన్ ఏమౌతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా తమపై కాస్త దయచూపి రేషన్ ఇప్పించండి అని పలువురు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

click me!