కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేయలేరు.. రెండు రాష్ట్రాలను కలుపుతాడా : జగన్‌పై సీపీఐ నారాయణ ఫైర్

By Siva KodatiFirst Published Dec 9, 2022, 5:28 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మళ్లీ కలవాలంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సొంత జిల్లాలో కడప స్టీల్ ప్లాంట్‌ను పూర్తి చేయలేని జగన్ రెండు రాష్ట్రాలను కలుపుతాడా అంటూ మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మళ్లీ కలిస్తే స్వాగతిస్తామంటూ వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణకు చెందిన పలువురు నేతలు కూడా స్పందించారు. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ... సొంత జిల్లాలో ఉక్కు పరిశ్రమ పూర్తి చేయలేని వ్యక్తి రెండు రాష్ట్రాలను కలుపుతాడా అంటూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం సీపీఐ శుక్రవారం పాదయాత్రను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నారాయణ హాజరయ్యారు. జమ్మలమడుగు నుంచి కడప కలెక్టరేట్ వరకు నాలుగు రోజుల పాటు ఈ పాదయాత్ర జరగనుంది. 

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ శిలాఫలకాలకే పరిమితమైందని దుయ్యబట్టారు. ఏ అదానికో అప్పగిస్తే వారైనా పూర్తి చేసేవారంటూ ఆయన హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రధానిని సీఎం జగన్ నిధులు అడగటడం లేదన్నారు. ఇప్పుడు మరోసారి సమైక్యవాదాన్ని లేపుతున్నారని నారాయణ మండిపడ్డారు. 

Also REad:కుదిరితే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాలన్నదే మా విధానం: ఉండవల్లి వ్యాఖ్యలకు సజ్జల కౌంటర్

అంతకుముందు బుధవారం వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమన్నారు. రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముంటుందన్నారు.  రెండు రాష్ట్రాలు  కలిసే దానికోసం వైకాపా పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ  తమ పార్టీ పోరాడుతుందన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్  పనిగట్టుకుని జగన్ వైపు చూపించినట్లు తెలుస్తోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.  అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ,బీజేపీలు విభజనకు అనుకూలంగా వ్యవహరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే  తొలుత స్వాగతించేది తామేనన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వాదనలు  వినిపిస్తామన్నారు.  రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలన్నారు. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.  రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే  న్యాయస్థానంలో  కేసు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విభజన చట్టంలో హామీల అమలు కోసం కాదన్నారు.విభజనచట్టంలో  హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని ఆయన చెప్పారు.

click me!