పంచాయితీరాజ్ శాఖలో కలకలం... ప్రధాన కార్యాలయానికి తాకిన కరోనా సెగ

By Arun Kumar PFirst Published Jul 14, 2020, 6:44 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారింది.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంతో ఆ శాఖలో పనిచేసే ఉద్యోగుల రక్షణను  దృష్టిలో వుంచుకుని ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ  ప్రధాన కార్యాలయానికి ఎవ్వరూ రావద్దని సర్కులర్ జారీ చేశారు. 
విభాగాధిపతి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పీఆర్ఆర్డీ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు సిబ్బందికి కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశాలిచ్చారు. 

జిల్లాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది కూడా ప్రధాన కార్యాలయానికి రావద్దని సర్కులర్ లో పేర్కోన్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ జిల్లా అధికారుల అనుమతి లేనిదే జిల్లా ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పనులేమైనా ఉంటే ప్రధాన కార్యాలయానికి  ఈ-మెయిల్స్ పంపాలని సూచించారు.  కరోనా వైరస్ ఉధృతి తగ్గేంత వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. 

read more   పశ్చిమ గోదావరిలో దారుణం: కరోనా లేదని చెప్పినా వైద్యం చేయలేదు, గర్భిణి మృతి

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. కోవిడ్ -19 మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా ఏపీలో 43 మంది కరోనాతో మరణించారు. తాజాగా అనంతపురం జిల్లాలో పది మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 9 మంది కరోనాతో మరణించారు. తూర్పు గోదావరి, కడప జిల్లాల్లో ఐదుగురేసి మరణించారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురేసి మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నం జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు చనిపోయారు. దీంతో ఏపీలో కరోనా వైరస్ తో మరణించినవారి సంఖ్య 408కి చేరుకుంది. ఒక్క కర్నూలు జిల్లాలోనే 108 మంది మృత్యువాత పడ్డారు. 

కాగా, గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1916 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. రాష్ట్రానికి చెందినవారిలో 1908 మందికి కరోనా సోకగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో గత 24 గంటల్లో 8 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 2424 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. విదేశాల నుంచి వచ్చినవారిలో గత 24 గంటల్లో ఎవరికి కూడా కరోనా వైరస్ సోకలేదు. విదేశాల నుంచి వచ్చినవారిలో ఇప్పటి వరకు 432 మంది కరోనా వైరస్ తో బాధపడుతున్నారు.  

తాజాగా గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కేసులో నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 238 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం జిల్లాలో 215 కేసులు నమోదయ్యాయి. తాజాగా గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 185, తూర్పు గోదావరి జిల్లాలో 160, గుంటూరు జిల్లాలో 146, కడప జిల్లాలో 112, కృష్ణా జిల్లాలో 129 కేసులు నమోదయ్యాయి. 

కర్నూల జిల్లాలో 169, నెల్లూరు జిల్లాలో 165, ప్రకాశం జిల్లాలో 32, విశాఖపట్నం జిల్లాలో 28, విజయనగరం జిల్లాలో 130, పశ్చిమ గోదావరి జిల్లాలో 199 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 22,670 శాంపిల్సును పరీక్షించగా రాష్ట్రానికి చెందినవారిలో 1,908 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 
 

click me!