జల్లికట్టు వెనుక కుట్ర కోణం?

First Published Jan 24, 2017, 7:17 AM IST
Highlights

ఘటనలు జరుగుతున్న తీరు చూస్తుంటే తెరవెనుక ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానాలనే బలపరుస్తున్నాయి.

 

జల్లికట్టు నేపధ్యంలో తమిళనాడులో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకమయ్యేకొద్దీ ఏదైనా కుట్ర జరుగుతున్నదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం జల్లికట్టు కోసం ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఆందోళన సమసిపోతుందని భావించారు. అయితే, అందరి అంచనాలకు విరుద్ధంగా అప్పటి నుండే ఆందోళనలు హింసాత్మకంగా మారియి. దాంతో అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి.

 

సిఎంగా కుదురుకుంటున్న పన్నీర్ శెల్వను బదనాం చేసే ఉద్దేశ్యంతో ఎవరో వెనకుండి ఆందోళనను హింసాత్మకం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు ఏకంగా పోలీసుస్టేషన్లకు, పోలీసు వాహనాలకే నిప్పు పెట్టటంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఆందోళనల్లో పాల్గొనే మామూలు జనాలెవరూ హింసాత్మకఘటనలకు పాల్పడరు. ఏదో ఆవేశంలో రోడ్డుపైకి వస్తారే కానీ పోలీసు స్టేషన్లకు, పోలీసు వాహనాలకు నిప్పు పెట్టేంత సాహసం చేయరు.

 

వందలాదిమంది పోలీసులుండగానే హింసాత్మకఘటనలు జరుగుతున్నాయంటేనే అసాంఘిక శక్తులు ప్రవేశించాయన్నది అర్ధమవుతోంది. అదే అనుమానాన్ని ప్రభుత్వం కూడా వ్యక్తంచేసింది. దాని తర్వాతే ఆందోళనకారులు మరింత రెచ్చిపోతున్నారు. దానికితోడు గంటల వ్యవధిలోనే ఆందోళన హింసాత్మకంగా మారి రాష్ట్రమంతటా పాకింది. ఇంత తొదరగా హింసాత్మక ఘటనలు రాష్ట్రమంతటా పాకటంతో ఆందోళనకారుల్లో సంఘవిద్రోహ శక్తులు చొరబడినట్లు ప్రభుత్వం నిర్ధారణకు వస్తోంది.  

 

జయలలిత మరణం తర్వాత ముఖ్యమంత్రి పన్నీర్ శెల్వం-ప్రధాన కార్యదర్శి శశికళ వర్గాలు రెండుగా చీలిపోయాయి. పన్నీర్ ను పదవి నుండి దింపేసి శశికళ సిఎం అవుదామని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో తమిళనాడు అధికార రాజకీయాల్లో వేలుపెట్టేందుకు భాజపా ప్రయత్నించింది. రెండు వర్గాలనూ తన గుప్పిట్లో పెట్టుకోవాలని భాజపా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

 

తమలో తాము కలహించుకుంటున్న వర్గాలు భాజపాకు అవకాశం ఇవ్వలేదని సమాచారం. దాంతో భాజపాకు మండింది. అదే సమయంలో జల్లికట్టు వివాదం మొదలైంది. జల్లికట్టును అడ్డంపెట్టుకోవాలని ప్రయత్నించినా భాజపాకు సాధ్యం కాలేదు. ప్రజాగ్రహాన్ని చూసిన కేంద్రం దిగరాక తప్పలేదు. అందుకే రాష్ట్రప్రభుత్వం ద్వారానే ఆర్డినెన్స్ జారీ చేయించింది. దాంతో క్రెడిట్ మొత్తం పన్నీర్ శెల్వం ఖాతాలో పడింది.

 

దాంతో రాష్ట్రంలో అందరూ పన్నీర్ కే జేజేలు పలకటం మొదలుపెట్టారు. అక్కడే ఇటు శశికళ అటు భాజపాకు  మండినట్లుంది. పన్నీర్ గనుక బడలపడితే వచ్చే ఇబ్బందులను గ్రహించిన రెండు వర్గాల మధ్య తెరవెనుక మంత్రాంగం నడిచిందని ప్రచారం. దాని తర్వాతనే ఆందోళనలు హింసాత్మకంగా మార్చాయని సమాచారం. ఘటనలు జరుగుతున్న తీరు చూస్తుంటే తెరవెనుక ఏదో కుట్ర జరుగుతోందన్న అనుమానాలనే బలపరుస్తున్నాయి. చూద్దాం, ఇవాళ కాకపోయినా మెల్లిగానైనా కుట్రకోణం వెలుగు చూడకమానదు కాదా?

click me!