ఆగనంటున్న ముద్రగడ - సాగదంటున్న పోలీసులు

First Published Jan 24, 2017, 6:57 AM IST
Highlights

అటు వేలాది మంది పోలీసులు, ఇటు కాపులు.  రావుల పాలెం కాపు సత్యాగ్రహానికి సై అంటున్న ముద్రగడ

అటూ వైపు ‘దశ్ బచావో’ అంటూ పవన్  కల్యాణ్  వైజాగ్ బీచ్ ప్రొటెస్టుకు సన్నద్ధమవుతూ ఉంటే, మరొక వైపు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం నాడు కాపు సత్యాగ్రహానికి  సమాయత్త మవుతున్నారు. తేడా,  ముద్రగడ పోలీసు దిగ్బంధంలో ఉన్నారు.ఇంటి నుంచి బయటకు రానీయకుండా పోలీసుల పహారా కాస్తున్నారు. పవన్ కు ఆసమస్య లేదు.

 

ముద్రగడ  మొండిపట్టు అందరికి తెలిసిన విషయమే. ఇపుడే కాదు, 25 సంవత్సరాల కిందట అలాగే ఉన్నారు.ఇపుడలాగే ఉన్నారు. అందకే  తన పాదయాత్రను ప్రారంభించేందుకు  మూడో సారి రేపు ప్రయత్నం చేస్తున్నారు. కాపులకు బిసి హోదా కోరుతూ, రిజర్వేషన్లలో కోటాకోసం ఆయన రేపు రావులపాలెం నుంచి అంతర్వేదికి పాదయాత్ర జరుపుతున్నట్లు ప్రకటించారు. పోలీసుల చెబుతున్నట్లు ఆయన దీనికి అనుమతి తీసుకోదల్చుకోలేదు.

 

ప్రభుత్వం మీదనిరసన తెలిపేందుకు ప్రజాస్వామ్యంలో అనుమతి ఏమిటని ఆయన పశ్నిస్తున్నారు. ఒక సారి అనుమతి తీసుకుంటే, ఇక ఉద్యమాలే చేపట్టలేమని  అందుకే అనుమతి తీసుకునేది లేదు, ఏంచేస్తారో చేసుకోండని రేపటి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇది మూడో సారి.

 

అయితే, ప్రభుత్వం కూడా నిర్బంధం పెంచేసింది.  జిల్లా మొత్తం సెక్షన్ 30 విధించి ఎక్కడ సమావేశాలు, వూరేగింపులు లేకుండా చేసింది. 144 సెక్షన్ విధించినట్లు, అలజడి సృష్టించడం  మానుకోవాలని జిల్లాకలెక్టర్ అరుణ్ కుమార్ తెలిపారు.


 ముద్రగడ  ఉద్యమం ముందుకు సాగకుండా కాపు నాయకులపై గృహ నిర్బంధం అమలు చేస్తున్నారు. ఈ మేరకు కాపు జేఏసీ నాయకులు బాజి, కొమ్మూరి మల్లిబాబులను మంగళవారం పి.గన్నవరంలో హౌస్‌ అరెస్టు చేశారు. రాజకీయ ప్రసంగాలు, దర్నాలు, వాటి ప్రత్యక్ష ప్రసారాలపై అంక్షలు విధించారు. అలాగే బల్క్ ఎస్ ఎం ఎస్ లను పంపడం ఫిబ్రవరి వరకు నిషేధించారు. కోనసీమ, కాకినాడ ప్రాంతాలలో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించి,  బయటి ప్రాంతాలనుంచి  ముద్రగడ అభిమానులెవరు కిర్లంపూడికి రాకుండా అడ్డుకుంటున్నారు.


రావులపాలెం 16వ నంబరు జాతీయ రహదారి మీదే ఉండటం, ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభం అవుతూండటంతో ఈ పరిసర ప్రాంతాలు పోలీసులు అదుపులోకి వెళ్లాయి. గత ఏడాది జనవరిలో తుని హింసాత్మక  సంఘటన పునరావృతం కాకూడదనే కారణంతో పోలీసు నిర్భంధం తీవ్రం చేశారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన నలుగురు డీఎస్పీలు, అయిదుగురు సీఐలు, 17 మంది ఎస్సైలు, 370 మంది పోలీసు ఇక్కడకు చేరుకున్నారు. దాదాపు నాలుగువేల పోలీసులను ఇక్కడ మొహరించినట్లు చెబుతున్నారు.  జిల్లా అదనపు ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌, శిక్షణ ఐపీఎస్‌ అధికారిణి అజితల ఆధ్వర్యంలో స్థానిక పోలీసు స్టేషన్‌ నుంచి 16వ నంబరు జాతీయ రహదారిపై అదనపు బలగాలతో కవాతు కూడా నిర్వహించారు.

 

ముద్రగడ పద్మనాభం యాత్ర 25న ఉదయం 10 గంటలకు రావులపాలెం నుంచి సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభిస్తారు. షెడ్యూల్ ప్రకారం ఈ యాత్ర ఐదురోజులపాటు కొనసాగుతుంది.ఈ యాత్రను అణిచేసే బాధ్యతను మరొక కాపు నేత హోం మంత్రి , ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీసుకోవడం విచారకరం. ఇది కాపునేతలను బాగా బాధిస్తున్నదని చెబుతున్నారు. 

click me!