
కోళ్ళ పందేల నిర్వహణపై సర్వత్రా ఉత్కంఠ పెరిగిపోతోంది. సంక్రాంతి పండుగ తేదీ దగ్గర పడే కొద్దీ కోళ్ళ పెందేల నిర్వాహకుల్లోనే కాకుండా పందెంరాయళ్ళలో కూడా ఒకటే టెన్షన్. పందేల నిర్వహణకు హైకోర్టు బ్రేకులు వేయటమే ప్రధాన కారణం. అయితే, హైకోర్టు చెప్పినంత మాత్రాన నిర్వాహకులు ఊరికే ఉంటారా. వెంటనే సుప్రింకోర్టును ఆశ్రయించారు.
దశాబ్దాల తరబడి ఉభయగోదావరి జిల్లాల్లో కోళ్ళ పందేలు సంప్రదాయంగా జరుగుతున్నాయి. ఈ పందేల్లో వందల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. అయితే ఇదంతా చట్ట వ్యతిరేకంగా జరిగేవే. ఈ విషయాలు అందరికీ తెలిసే జరుగుతాయి. పోటీల నిర్వహణలో పార్టీ నేతలంతా ఒకటే. అందుకే ప్రభుత్వం ఎన్ని సార్లు నిషేధం విధించినా సాధ్యం కావటం లేదు.
జంతు పరిరక్షణ సంస్ధ నిర్వాహకులు ఈ విషయమై న్యాయస్ధానాన్ని ఆశ్రయించటంతో కోళ్ళ పందేల నిర్వహణపై హై కోర్టు సీరియస్ అయింది. హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ పారిశ్రామిక వేత్త రఘురామకృష్ణమరాజు సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఆ పిటీషన్ గురు, శుక్రవారాల్లో విచారణకు వస్తున్నది.
ఎలాగైనా సరే పందేల నిర్వహణకు అనుమతులు సాధించాలంటూ పలువురు గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకనే సుప్రింకోర్టుకు అనేక హామీలిచ్చారు. కోళ్ళకు కత్తులు కట్టమని, పందేల నిర్వహణలో డబ్బుల ప్రస్తావనే ఉండదని హామీ కూడా ఇచ్చారు. దాంతో హై కోర్టు విధించిన స్టే ఉత్తర్వులపై సుప్రింకోర్టులో ఊరట లభిస్తుందని అనుకుంటున్నారు.
ఇదిలావుండగా, పోలీసులు కాస్త అతి చేస్తున్నారు. ఇళ్ళలో పెంచుకునే కోడి పుంజులను కూడా స్వాధీన చేసుకుంటున్నారు. గడచిన రెండు రోజులుగా ఉభయగోదావరి జిల్లాల్లోని పలు ఇళ్ళపై పోలీసులు దాడులు చేయటం ఆశ్చర్యంగా ఉంది. పందెం నిర్వహిస్తారని అనుమానం వచ్చిన ప్రతీ ఇంటిపైన పోలీసులు దాడులు చేయటం విచిత్రమే.
అదే సందర్భంగా పందేలకు అనుమతులు వస్తాయన్న ఉద్దేశ్యంతో దేశ, విదేశాలకు చెందిన పలువురు పందెం రాయళ్ళు ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు హోటళ్ళు, అతిధి గృహాల్లో గదులను బుక్ చేసేసుకున్నారు. భీమవరం, ఏలూరు లాంటి చోట్ల హోటళ్ళకు బాగా గిరాకీ పెరిగిపోయింది.
భీమవరంలోని వివిధ హటళ్ళల్లో సుమారు 500 గదులను పందెంరాయళ్ళు బుక్ చేసుకున్నారు. అతిధిగృహాలు దీనికి అదనం. అంటే కోళ్ళ పందేలపై నిర్వాహకులు, పందెం రాయళ్ళు ఎంతటి ధీమాతో ఉన్నారో అర్ధం అవుతోంది.