మంత్రుల్లో అసంతృప్తా ?

Published : Jan 03, 2017, 03:50 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
మంత్రుల్లో అసంతృప్తా ?

సారాంశం

మంత్రివర్గంలోని మొత్తం 19మందిలో అత్యధికులు మొదటిసారి మంత్రైన వారే కావటంతో బయటపడితే ఉన్నది కూడా పోతుందేమో అన్న భయంతో ఏమి మాట్లాడటం లేదు.

 

చంద్రబాబు మంత్రివర్గంలోని చాలా మంది మంత్రులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఏదో పేరుకు మంత్రిగా కొనసాగుతున్నారే గానీ మంత్రి స్ధాయి గౌరవ, మర్యాదలు అందటం లేదనే అసంతృప్తి చాలా మందిలో పేరుకుపోయింది. ఇటు శాఖలోనే కాకుండా బయట కూడా పెద్దగా విలువ లేదని బాధపడుతున్న మంత్రులు బోలెడుమందున్నారు .  

 

మంత్రుల్లో పెరిగిపోతున్న అసంతృప్తి వల్ల  చాలామందికి చంద్రబాబునాయుడుతో గ్యాప్ పెరిగిపోతోంది. చంద్రబాబు వ్యవహారశైలిని దగ్గర నుండి గమనిస్తున్న నేతలు సిఎంలో 1999-2004 మధ్య లక్షణాలు బాగా కనబడుతున్ననట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

దాని ఫలితంగా చాలా మంది మంత్రుల పరిస్ధితి దయనీయంగా తయారైందని అంటున్నారు. అందుకనే ఇదివరకులా పలువురు మంత్రులు చంద్రబాబును కలవటానికి పెద్దగా ఇష్టపడటం లేదు. దాని  ప్రభావం  వల్ల కొన్ని శాఖల్లో పాలనాపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నా మంత్రులు పెద్దగా పట్టించుకోవటం లేదు.

 

గ్యాప్ పెరగటానికి పార్టీ వర్గాలు కొన్ని కారణాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంతో చాలా మంది మంత్రులకు సరైన సంబంధాలు లేకపోవటం, శాఖల్లో మాట చెల్లుబాటు కాకపోవటం, పనులు కాకపోవటం, మంత్రులకు,  ఉన్నతాధికారులకు మధ్య పెద్దగా సఖ్యత లేకపోవటం లాంటి కారణాల వల్ల పలువురు మంత్రులు సిఎం వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్నారు.

 

వివిధ శాఖల్లో మంత్రులు పాలనను పూర్తిగా ఉన్నతాధికారులకే వదిలిపెట్టేసినట్లు కనబడుతోంది. చాలా మంది మంత్రులు ప్రోటోకాల్ కోసమే మంత్రివర్గంలో కొనసాగుతున్నారంటే అతిశయోక్తి కాదు. బదిలీలు, పదోన్నతులు లాంటి వ్యవహారాల్లో మంత్రుల మాటకన్నా ఉన్నతాధికారుల మాటకే విలువ ఎక్కువుంటున్నది.

 

ఉదాహరణకు రెవిన్యూ, అటవీ, గనులు, ఎక్సైజ్, విద్యా శాఖల్లో  మంత్రులు చేసిన బదిలీలు ఆగిపోయాయి. బదిలీల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావటంతో సిఎం మొత్తం బదిలీలన్నింటినీ నిలిపేసారు. ఆ తర్వాత మార్పులు, చేర్పులతో బదిలీలు పూర్తయ్యాయి.

 

అయితే విడుదలైన ఉత్తర్వుల్లో మంత్రుల ముద్ర పెద్దగా లేదు. దాంతో పనులు కావాల్సిన వారిలో అత్యధికులు మంత్రుల దగ్గర కన్నా ఉన్నతాధికారుల వద్దకే వెళ్ళి పనులు చేయించుకున్నట్లు ప్రచారం జరుగుతోదంది. దాంతో మంత్రుల మాటకు విలువపడిపోతోంది. తమ శాఖల్లో ‘ఇతరుల’ జోక్యం మితిమీరిపోవటాన్ని కూడా చాలా మంది సహించలేకున్నారు.

 

అయితే, మంత్రివర్గంలోని మొత్తం 19మందిలో అత్యధికులు మొదటిసారి మంత్రైన వారే కావటంతో బయటపడితే ఉన్నది కూడా పోతుందేమో అన్న భయంతో ఏమి మాట్లాడటం లేదు.

 

మంత్రులతో కన్నా సిఎం ఉన్నతాధికారులతోనే నేరుగా మాట్లాడుతుండటం కూడా మంత్రులకు పెద్ద మైనస్ గా మారిపోయింది. ఉన్నతాధికారులు శాఖాపరమైన నిర్ణయాలకు ముందు మంత్రులను కలిసేవారు. కానీ ఇపుడు నేరుగా సిఎంతోనే మాట్లాడేసుకుంటున్నట్లు సమాచారం.

 

ఇటువంటి విషయాల వల్ల మంత్రులు జిల్లాలోనే కాకుండా తమ నియోజకవర్గాల్లో కూడా జనాల ముందు పలుకనైపోతున్నారు. దాంతో చాలామంది మంత్రుల్లో అసంతృప్తి పేరుకుపోతోంది. సిఎంతో చెప్పి పనిచేయించుకోలేక, ఉన్నతాధికారులు మాట వినక మంత్రులు ఇబ్బంది పడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?