
పిడుగురాళ్ల : ఇటీవలి కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వయసు తేడా లేకుండా, చిన్నా, పెద్దా ప్రతి ఒక్కరూ గుండెపోటు బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్లోని పిడుగురాళ్ల పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి ఎస్సీ బాలుర హాస్టల్ కు చెందిన ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మండలంలోని గుత్తికొండ గ్రామానికి చెందిన మంద కోటేశ్వరరావు కొడుకు కోటి స్వాములు.
ఈ అబ్బాయి పట్టణంలోని ఎస్సీ బాలుర హాస్టల్లో ఉండి ఇక్కడే ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ లో 8వ తరగతి చదువుకుంటున్నాడు. రోజులాగే శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత స్టడీ అవర్లో కూర్చున్నారు.. ఆ సమయంలో కోటి స్వాములు తనకు ఊపిరి ఆడడం లేదంటూ తోటి స్నేహితులకు చెప్పాడు. దీంతో వారు గాలి బాగా వచ్చే ప్లేస్ లో కూర్చోవాలని తెలిపారు. దీంతో రూమ్ లో ఉన్న ఫ్యాన్ కింద కూర్చోవడానికి వెళ్ళాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అప్పటికే అక్కడ ఉన్న మిగతా నలుగురు స్నేహితులు అతడిని లేపేందుకు ప్రయత్నించారు కానీ ఫలితం లేకపోయింది.
స్కూల్లో సీటు ఇప్పిస్తానని రూ.16 లక్షలు మోసం చేసిన జనసేన నాయకుడు.. కిరాణా వ్యాపారి ఆత్మహత్య...
దీంతో వెంటనే వాచ్మెన్ కి సమాచారం ఇచ్చారు. వాచ్మెన్ హుటాహుటిన వెళ్లి హాస్టల్ వార్డెన్ కి సమాచారం అందించాడు. హాస్టల్ వార్డెన్ కోటిస్వాములను ప్రైవేటు వైద్య కళాశాలకు తీసుకెళ్లారు. అక్కడ కోటి స్వాములను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లుగా నిర్థారించారు. వెంటనే హాస్టల్ వార్డెన్ గోపీనాయక్ గుత్తికొండలో ఉంటున్న బాలుడు తల్లిదండ్రులకు ఈమెరకు సమాచారం అందించారు. సమాచారం అందుకుని హాస్టల్ కి వచ్చిన కుటుంబ సభ్యులు బాలుడి మృతదేహాన్ని చూసి కన్నీరుగా విలపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈనెల మొదట్లో తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గుండెపోటు ఓ 13 ఏళ్ల చిన్నారిని బలి తీసుకుంది. మెహబూబాబా బాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయి పాలెంలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అబ్బాయిపాలెం శివారు బోడ తండాకు చెందిన దంపతులు బోడ లక్పతి, వసంత. వారి కూతురు స్రవంతి. 13యేళ్ల చిన్నారి. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటుంది. శ్రీరామనవమి సందర్భంగా పాఠశాలకు సెలవు ఇచ్చారు.
సెలవు రోజు కావడంతో తండాలోని తన స్నేహితులతో రోజంతా ఆడుకుంది. రాత్రి అయ్యాక మామూలుగానే నిద్రపోయింది. ఆమెకు రోజూ నానమ్మ దగ్గర పడుకునే అలవాటు. ఆ రోజు కూడా అలాగే పడుకుంది. అయితే శుక్రవారం తెల్లవారుజామున సడన్ గా మేల్కొన్న ఆమె.. తనకు ఏదో అవుతుందని ఆయాస పడుతూ నాన్నమ్మను లేపింది. కంగారుపడి నిద్రలేచిన ఆమె ఏం జరిగిందని అడుగుతుంటే.. ఆయాస పడుతూ మాట్లాడలేకపోయింది.. మంచం మీద లేచి కూర్చుని ఒక్కసారిగా మంచం పైనే పక్కకు ఒరిగిపోయింది.
వెంటనే ఆమె తన కొడుకు, కోడలికి విషయం తెలిపింది. కంగారు పడిన తల్లిదండ్రులు వెంటనే కూతుర్ని తీసుకుని దగ్గరలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పరుగులు తీశారు. అయితే, అక్కడికి వెళ్లేసరికి ఆమె చనిపోయిందని డాక్టర్ తెలపడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.