పరిటాల,మద్దెలచెర్వు రక్తచరిత్ర ఇదీ: ఇక ముగిసేనా?

By narsimha lode  |  First Published Dec 19, 2018, 3:44 PM IST

అనంతపురం జిల్లాలో పరిటాల, మద్దెల చెర్వు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులో వందలాది మంది మృత్యువాత పడ్డారు. రెండు తరాలు ఈ ఫ్యాక్షన్ గొడవల్లో అంతమయ్యాయి



అనంతపురం: అనంతపురం జిల్లాలో పరిటాల, మద్దెల చెర్వు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులో వందలాది మంది మృత్యువాత పడ్డారు. రెండు తరాలు ఈ ఫ్యాక్షన్ గొడవల్లో అంతమయ్యాయి.మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో నిందితుడుగా ఉన్న మద్దెలచెర్వు సూరిని అతని  అనుచరుడు భాను హత్య చేశారు. ఈ కేసులో భానుకు జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే.

అనంతపురం జిల్లాకు చెందిన పరిటాల శ్రీరాములు,మద్దెల చెర్వు నారాయణరెడ్డిలు ఇద్దరూ స్నేహితులు. 1968లో ఈ రెండు కుటుంబాల మధ్య జరిగిన ఓ ఘటన ఈ కుటుంబాల మధ్య చిచ్చును రేపింది. దీంతో స్నేహితులు శత్రువులుగా మారారు.  పరిటాల శ్రీరాములు పీపుల్స్‌వార్‌లో చేరారు. దరిమిలా ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్యపోరు కూడ ఆరంభమైంది.

Latest Videos

1975లో పరిటాల శ్రీరాములును  ప్రత్యర్థులు నరికి చంపారు.శ్రీరాములు హత్య అనంతలో ఫ్యాక్షన్ గొడవలకు నాంది పలికాయి. శ్రీరాములు పెద్ద కొడుకు హరి కూడ పీపుల్స్‌వార్‌లో చేరారు. అయితే  పరిటాల హరిని  కూడ పోలీసులు 1979లో ఎన్‌కౌంటర్‌ చేశారు. పరిటాల హరి ఎన్‌కౌంటర్‌కు పరిటాల వర్గీయులు ప్రతీకారాన్ని తీర్చుకొన్నారు.

1983లో అనంతపురం పట్టణంలోని అన్నపూర్ణ లాడ్జి వద్ద పరిటాల వర్గీయులు నారాయణరెడ్డిని చంపేశారు.నారాయణరెడ్డి హత్యకు గురి కావడంతో  ఆయన బంధువు చెన్నారెడ్డి నారాయాణరెడ్డి   కుటుంబానికి అండగా నిలిచారు.1989లో చెన్నారెడ్డి పెనుకొండ నుండి  ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో  పరిటాల శ్రీరాములు చిన్న కొడుకు పరిటాల రవి అజ్ఞాతంలోకి వెళ్లాడు.  అదే సమయంలో  పీపుల్స్‌వార్‌లో కీలకంగా పనిచేస్తున్న ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పోతుల సురేష్, అనంతపురం జిల్లాకు చెందిన  చమన్‌లు పరిచయమమయ్యారు. 

తన తండ్రిని, సోదరుడిని హత్య చేసిన ప్రత్యర్థులను రవి తన స్నేహితులతో కలిసి హత్య చేశారని అప్పట్లో ఆరోపణలు  ఉన్నాయి. 1991 మే 7వ తేదీన ఎమ్మెల్యే చెన్నారెడ్డిని ఆయన ఇంట్లోనే రవి వర్గీయులు హత్య చేశారని ప్రచారంలో ఉంది.

1993 అక్టోబర్ 24వ తేదీన మద్దెలచెర్వుసూరి ఇంట్లో టీవీ బాంబు పేలింది.ఈ ఘటనలో మద్దెల చెర్వు సూరి తమ్ముడు,  రఘునాథరెడ్డి, సోదరి పద్మావతి, తల్లి సాకమ్మ, నారాయణప్పలు మృతి చెందారు. అంతేకాదు సానె చెన్నారెడ్డి కొడుకులు ఓబుల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి కూడ శత్రువుల చేతిలో హత్యకు గురయ్యారు.

అజ్ఞాతం నుండి బయటకు వచ్చిన పరిటాల రవి  టీడీపీలో చేరారు. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా మారారు. మరోవైపు రవి సన్నిహితుడు పోతుల సురేష్ కూడ ఆర్వోసీని నడిపించేవాడు. రవి వ్యతిరేక వర్గీయులను ఆర్వోసీ హత్య చేసింది. ఆర్వోసీ రవికి వ్యతిరేకంగా కూడ ఆ సమయంలో ప్రకటనలు చేసింది.  కానీ, ఈప్రకటనలు కూడ వ్యూహత్మకమేనని ప్రచారం కూడ లేకపోలేదు.

పరిటాల రవి తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా శ్రీరాములయ్య సినిమా తీయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం రోజున 1997 నవంబర్ 19వ తేదీన  కారు బాంబు పేలుడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో  పరిటాల రవి తృటిలో తప్పించుకొన్నారు. 

కానీ,  ఈ ఘటనలో జర్నలిస్టులు మృత్యువాత పడ్డారు. టీవీ బాంబుకు ప్రతీకారంగానే  మద్దెలచెర్వు సూరి కారు బాంబుకు ప్లాన్ చేశారని సూరిపై కేసు నమోదైంది. ఈ కేసులో సూరి 13 ఏళ్లు జైలు శిక్షను అనుభవించారు.  

ఇదిలా ఉంటే 2005 జనవరి 24 వతేదీన అనంతపురం జిల్లా జడ్పీ ఛైర్మెన్ ఎన్నిక విషయమై పార్టీ నేతలతో చర్చించి ఇంటికి వెళ్లబోతుండగా పరిటాల రవిని  ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఈ ఘటనకు ముందే తనపై దాడి జరిగే అవకాశం ఉందని పరిటాల రవి  పలు దఫాలు బహిరంగంగానే చెప్పారు. పలు మార్లు రవి ఇంటిపై పోలీసులు సోదాలు నిర్వహించారు.

అప్పటికే టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా  బాధ్యతలు స్వీకరించారు. రవి ప్రధాన అనుచరులుగా ఉన్న పోతుల సురేష్, చమన్‌లు కూడ  రవి ఆదేశాల మేరకు అజ్ఞాతంలోకి వెళ్లారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోతుల సురేశ్‌ 2010 అక్టోబరు 17న పోతుల సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

చమన్ కూడ 2014 ఎన్నికలకు రెండేళ్ల ముందు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనంతపురం జిల్లాలో జిల్లా పరిషత్‌ను టీడీపీ కైవసం చేసుకొంది. దీంతో  చమన్‌ ను చంద్రబాబునాయుడు జిల్లా పరిషత్ ఛైర్మెన్‌ గా చేశారు. అయితే పరిటాల రవి ఇంట్లో వివాహనికి హజరైన చమన్ ఇటీవలనే గుండెపోటుతో  మృత్యువాతపడ్డారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పోతుల సురేష్  సతీమణి పోతుల సునీత ప్రకాశం జిల్లా చీరాల నుండి టీడీపీ అభ్యర్థిగా 2014 లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆమెకు చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. పరిటాల రవి బతికున్న సమయంలో  ఆలంపూర్ నుండి 2004 ఎన్నికల్లో  పోతుల సునీత టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

2009 డిసెంబరు 29న జైలు నుండి మద్దెలచెర్వు సూరీ విడుదలయ్యాడు. ఫ్యాక్షన్ ‌కు దూరంగా ఉంటానని పదే పదే ప్రకటించారు. అయితే  మద్దెలచెర్వు సూరి ప్రధాన అనుచరుడు భాను కిరణ్  2011 జనవరి 3వ తేదీన యూసుఫ్‌గూడ వద్ద కారులోనే హత్య చేశారు.ఈ కేసులోనే భానుకిరణ్‌‌కు  నాంపల్లి కోర్టు డిసెంబర్ 18వ తేదీన జీవిత ఖైదు విధించింది.


సంబంధిత వార్తలు

పరిటాల కుటుంబం కళ్లలో ఆనందం కోసమే: భానుపై భానుమతి సంచలనం

భానుకిరణ్‌కు జీవిత ఖైదు:భానుమతి అసంతృప్తి

భాను కిరణ్ గురించి మద్దెలచెర్వు సూరి భార్య ఏమన్నారంటే...

సూరి హత్యకేసు:భానుకిరణ్ కు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి

click me!