Union Budget 2024: 'విశాఖపట్టణంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత'

By narsimha lodeFirst Published Feb 1, 2024, 5:40 PM IST
Highlights

 విశాఖ రైల్వే జోన్ కు  డీపీఆర్, నిధులు కూడ సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర మంత్రి ఆశ్విని వైష్ణవ్ చెప్పారు. 

న్యూఢిల్లీ: విశాఖపట్టణంలో  రైల్వే జోన్ విషయంలో  కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.  రైల్వే జోన్ విషయంలో డీపీఆర్, నిధులు సిద్దంగా ఉన్నట్టుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే జోన్ కు అవసరమైన  భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే  విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని  ఆయన తేల్చి చెప్పారు.

విశాఖ రైల్వే జోన్ కు  53 ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి చెప్పారు. రైల్వే జోన్ కు అవసరమైన భూమిని కేటాయించగానే  పనులు ప్రారంభిస్తామన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో  రూ. 886 కోట్లను రైల్వేల కోసం ఖర్చు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఈ బడ్జెట్ లోనే ఏపీ రాష్ట్రానికి రూ. 9 వేల కోట్లను కేటాయించినట్టుగా ఆయన గుర్తు చేశారు. ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 240 కి.మీ. మేరకు నూతన ట్రాక్ పనులు నిర్వహిస్తున్నామన్నారు.98 శాతం రైల్వేల విద్యుదీకరణ పనులు పూర్తైనట్టుగా  ఆయన గుర్తు చేశారు. 

also read:Union Budget 2024:40 వేల రైల్వే బోగీలను వందేభారత్ కోచ్ లుగా మార్పు

తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో సుమారు  రూ. 5 వేల కోట్లు కేటాయించింది. రెండు రాష్ట్రాలకు  కలిపి  రూ. 14 వేల కోట్లను కేటాయించినట్టుగా  కేంద్ర ప్రభుత్వం వివరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో  రైల్వే ప్రాజెక్టులకు  కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను కేటాయించినట్టుగా  ఆయన  వివరించారు.రైల్వే శాఖకు సంబంధించి  ఆయా రాష్ట్రాలకు  కేటాయింపులను ఆశ్విని వైష్ణవ్ వివరించారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్  ఇవాళ మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వరుసగా ఆరోసారి నిర్మలాసీతారామన్  బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.
 

click me!