వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు పులివెందులలో పలు ప్రాంతాల్లో విచారించారు. వివేకానందరెడ్డి వద్ద పనిచేసిన ఇనాయతుల్లాతో కలిసి పలు ప్రాంతాల్లో విచారణ చేశారు.
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులలో సీబీఐ అధికారులు మంగళవారం నాడు విచారణ నిర్వహించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి వద్ద పనిచేసిన ఇనయతుల్లాను సీబీఐ అధికారులు విచారించారు. ఇనయతుల్లాను తీసుకుని పులివెందుల పట్టణంలో సీబీఐ అధికారులు విచారించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది.
ఇప్పటికే ఈ కేసులో పలువురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
undefined
2019 మార్చి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కు గురయ్యారు. ఆ సమయంలో సీఎంగా ఉన్నచంద్రబాబునాయుడు సిట్ ను ఏర్పాటు చేశాడు. ఎన్నికల తర్వాత ఏపీలో వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టారు. జగన్ సర్కార్ కూడా సిట్ ను ఏర్పాటు చేసింది. అయితే ఈ హత్య కేసుపై సీబీఐ దర్యాప్తు చేయాలని పలువురు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విషయమై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
వైఎస్ వివేకానందరెడ్డి వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి సీబీఐ అధికారులకు అప్ఱూవర్ గా మారాడు. దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టకు సీబీఐ అధికారులు సమర్పించారు. బెంగుళూరులో ల్యాండ్ సెటిల్ మెంట్ లో వచ్చిన డబ్బుల్లో తనకు వాటా ఇవ్వలేదని ఎర్ర గంగిరెడ్డి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారని దస్తగిరి ఈ వాంగ్మూలంలో పేర్కొన్నారు.దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో పాటు వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద వాచ్ మెన్ గా పనిచేసిన రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కూడా సీబీఐ అధికారులు కొందరిని అరెస్ట్ చేశారు.
ఇదిలా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఆంధ్రప్రదేశ్ లో కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో విచారణ నిర్వహించేలా ఆదేశాలివ్వాలని వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ పిటిషన్ పై విచారణను ఈ ఏడాది అక్టోబర్ 14కి వాయిదా వేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంబంధం ఉన్న వారు అనుమానాస్పదస్థితిలో మరణించిన ఘటనలు చోటు చేసుకున్న ఘటనలు కూడా రాష్ట్రంలో కలకలం రేపాయి.